కాలువ మూసి భారీ వెంచర్ నిర్మాణం
ABN , First Publish Date - 2022-08-04T06:05:51+05:30 IST
పట్టణంలో ఓ భారీ వెంచర్ అక్రమాలకు పాల్పడుతున్నది.
తుది లేఅవుట్ అనుమతులు రాకముందే ఇళ్ల నిర్మాణాలు
సదాశివపేట పట్టణంలో ఎన్‌వోసీ జారీ చేసిన ఉన్నతాధికారులు
సదాశివపేట, ఆగస్టు 3: పట్టణంలో ఓ భారీ వెంచర్ అక్రమాలకు పాల్పడుతున్నది. వెంచర్ నిర్మాణం సమయంలో వెంచర్ యాజమాన్యం వెంచర్‌కి పక్కనే ఉన్న ఓ కుంటకు చెందిన తూమును కూల్చి వేసి తమ వెంచర్‌కు ప్రమాదం లేకుండా తూము కట్ట ఎత్తును తగ్గించింది. అంతటితో ఆగకుండా తూము ద్వారా నీళ్లు ప్రవహించే(కాలువ)ను దర్జాగా పైపులతో భూమిలో కప్పివేయించింది. ఇంత జరిగినా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోలేదు. నిబంధనల మేరకు తూము కాలువకు ఇరువైపులా మూడు మీటర్ల మేర (బఫర్‌జోన్) ఉండాలి. ఈ బఫర్ జోన్ ప్రాంతమంతా ఖాళీ స్థలంగా ఉండాలి. ఎలాంటి నిర్మాణాలు ఉండరాదు. కానీ ఈ వెంచర్‌లో ఏకంగా తూము కాలువ మాయమైపోవడమే కాకుండా తూము కట్ట ఎత్తును సైతం తగ్గించిన ఆనవాళ్లు కళ్లకు కడుతున్నా...ఉన్నతాధికారులు వెంచర్ ఏర్పాటుకు (ఎన్‌ఓసీలు) నిరభ్యంతర సర్టిఫికెట్లు జారీ చేయడం గమనార్హం.
అనుమతులు రాకముందే ఇళ్ల నిర్మాణాలు
ఈ భారీ వెంచర్‌కు (డీటీసీపీ) డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుంచి తుది అనుమతులు రాక ముందే వెంచర్‌లో యఽథేచ్ఛగా బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో చెరువులు, కుంటల పరిధిలో వెలుస్తున్న వెంచర్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై చర్యలు తీసుకుని, జలవనరుల అస్తిత్వాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.