ఏడేళ్ల క్రితమే నిల‘బడి’..

ABN , First Publish Date - 2022-04-24T05:34:49+05:30 IST

మర్కుక్‌ మండలంలోని అంగడికిష్టాపూర్‌ గ్రామంలో 1,500 జనాభా ఉంటుంది. గ్రామంలో ప్రాఽథమికోన్నత స్థాయి వరకు ప్రభుత్వ పాఠశాల ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పట్టణాల్లో ప్రైవేటు పాఠశాలలకు పంపుతుండటంతో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. దీంతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఎనిమిది మంది విద్యార్థులే మిగిలారు. చివరకు మూతపడే పరిస్థితి ఏర్పడింది.

ఏడేళ్ల క్రితమే నిల‘బడి’..

మూతపడే పరిస్థితి నుంచి ప్రైవేటుకు దీటుగా నడుస్తున్న సర్కారు స్కూలు

అంగడి కిష్టాపూర్‌లో ప్రాథమికోన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు

2015లోనే ఈ గ్రామంలో మన ఊరు - మన బడికి శ్రీకారం


జగదేవపూర్‌, ఏప్రిల్‌ 23 : మర్కుక్‌ మండలంలోని అంగడికిష్టాపూర్‌ గ్రామంలో 1,500 జనాభా ఉంటుంది. గ్రామంలో ప్రాఽథమికోన్నత స్థాయి వరకు ప్రభుత్వ పాఠశాల ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పట్టణాల్లో ప్రైవేటు పాఠశాలలకు పంపుతుండటంతో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. దీంతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఎనిమిది మంది విద్యార్థులే మిగిలారు. చివరకు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓంకార్‌, అదే పాఠశాలలో చదువుకుని ఉపాధ్యాయుడిగా అక్కడికే వచ్చిన రామకృష్ణారెడ్డి బడిని కాపాడుకోవడానికి నడుంబిగించారు. ఎలాగైనా గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ బడికి రప్పించాలని గ్రామ సర్పంచ్‌ రాములుగౌడ్‌తో పాటు, గ్రామంలోని యువకులకు హెచ్‌ఎం ఓంకార్‌ పరిస్థితిని వివరించాడు. అర్థం చేసుకున్న గ్రామ యువకులు మన బడి - మన ఊరు అనే నినాదంతో గ్రామంలోని విద్యార్థులందరినీ ప్రభుత్వ బడికి పంపించేలా తల్లిదండ్రులను ఒప్పించారు. దాంతో ఎనిమిది మందితో ఉన్న బడి 180 మంది విద్యార్థులకు చేరింది.


ప్రైవేట్‌ వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు

ఎంతో డబ్బు ఖర్చుచేసి పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లకు పంపించినా పిల్లల చదువు అంతంతమాత్రంగానే ఉండటంతో అంగడికిష్టాపూర్‌ గ్రామస్థులు సమష్టిగా ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో ఐదో తరగతి వరకు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని అప్పటి సర్పంచ్‌ రాములుగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్ణయించారు. గ్రామంలో ఐదో తరగతి వరకు ఉన్న 50 మంది విద్యార్థులను ప్రభుత్వ బడికే పంపుతామని తీర్మానించి, ఎంఈవోకు తీర్మానపత్రాన్ని అందించారు. కానీ ఇంగ్లిష్‌ మీడియం విద్యను అందించాలని కోరారు. ప్రాఽథమికస్థాయిలో ఇంగ్లిష్‌ మీడియంకు అవకాశం లేదని ఎంఈవో చెప్పడంతో స్వయంగా గ్రామస్థులే ఇద్దరు ఉపాధ్యాయులను నియమించుకున్నారు. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారికి వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు. 2015 సంవత్సరంలో పాఠశాలలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలు ఏర్పాటు చేయగా గ్రామసభలో తీసుకున్న నిర్ణయం మేరకు 40 మంది పిల్లలను ప్రభుత్వ బడికి పంపించారు. ఇద్దరు ఉపాధ్యాయులను పెట్టుకున్నారు. రూ.60వేల విలువైన ఫర్నిచర్‌, కంప్యూటర్‌, సాంకేతిక విద్యను అందించడానికి ఫ్రొజెక్టర్‌, ప్రింటర్‌, ల్యాప్‌ట్యాప్‌ను పాఠశాలకు అందజేశారు. విద్యార్థులు అసెంబ్లీ నిర్వహించుకోవడానికి రూ.14 వేలతో మైక్‌సెట్‌ను సమకూర్చారు. కిష్టాపూర్‌ గ్రామంలోని విద్యార్థులే కాకుండా చేబర్తి, నర్సన్నపేట గ్రామాల నుంచీ విద్యార్థులను ఈ బడికి పంపడం ప్రారంభించారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఎనిమిది నుంచి 180 మందికి చేరింది.


కరోనా సమయంలోనూ వర్క్‌షీట్‌

2020-21 సంవత్సరంలో కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులందరూ విద్యకు దూరం కాగా ఉపాధ్యాయులు ఆ సమయంలో విద్యార్థుల కోసం ‘ది స్కూల్‌ ఆఫ్‌ అంగడి కిష్టాపూర్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. వాట్సాప్‌ గ్రూపులు చేసి విద్యార్థులకు నేరుగా రికార్డ్‌ చేసిన పాఠాలను వాట్సాప్‌ ఇతర మాధ్యమాల ద్వారా పంపించారు. నేర్చుకున్న పాఠాలను లైవ్‌ వర్క్‌షీట్‌ను రూపొందించి తరగతులవారీగా పిల్లల ప్రగతిని తల్లిదండ్రులకు చేరవేశారు. కరోనాతో దాదాపు రెండేళ్లు విద్యకు దూరమై ‘సీ’గ్రేడ్‌లో ఉన్న విద్యార్థుల ఉన్నతి కోసం లిటిల్‌ టీచర్‌ కాన్సెస్ట్‌ను ప్రారంభించారు. ‘ఏ’గ్రేడ్‌ పిల్లల సహాయంతో విద్యాబోధన చేస్తూ, వారి గ్రేడింగ్‌ ఉన్నతి కృషి చేసి సఫళీకృతులయ్యారు. ప్రతీ సంవత్సరం పాఠశాలలో గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహిస్తారు. పాఠశాలలో యూకేజీ పూర్తయిన పిల్లలకు డ్రెస్‌కోడ్‌ వేసి ప్రముఖులను ఆహ్వానించి విద్యార్థులకు పట్టాలు అందజేస్తుంటారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2022-04-24T05:34:49+05:30 IST