రామాయంపేటలో ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-04-17T05:40:40+05:30 IST

మెదక్‌ జిల్లా రామాయంపేటలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి సంతోష్‌, అతని తల్లి పద్మ మృతదేహాలతో మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ ఇంటి వద్ద మృతుల బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు.

రామాయంపేటలో ఉద్రిక్తం
మృతదేహాలతో మున్సిపల్‌ చైర్మన్‌ ఇంటి ముట్టడికి వెళ్తున్న వైకుంఠరథాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

మెదక్‌ జిల్లా రామాయంపేటలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి సంతోష్‌, అతని తల్లి పద్మ మృతదేహాలతో మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ ఇంటి వద్ద మృతుల బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. సంతోష్‌, పద్మ ఆత్మహత్యకు  మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాస్‌ యాదగిరి, గతంలో రామాయం పేటలో పని చేసి  తుంగతుర్తికి బదిలీ అయిన సీఐ నాగార్జునగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బాలు,కృష్ణాగౌడ్‌, స్వరాజ్‌, తోట కిరణ్‌లే  కారణమని బంధువులు ఆరోపించారు. జితేందర్‌గౌడ్‌, సరాసు యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్‌లను పదవీ, ఉద్యోగాల నుంచి  తొలగించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.  మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నిందితులకు ఒత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఫేస్‌బుక్‌లో అసభ్య పదజాలంతో సంతోష్‌ పోస్ట్‌ చేశాడన్న కారణంతో ఏడాదిన్నరగా జితేందర్‌గౌడ్‌, సరాస్‌ యాదగిరి మానసికంగా వేధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మృతుల బంధువులు మండిపడ్డారు. అసలు ఫేస్‌బుక్‌లో పెట్టిన కామెంట్‌కు సంతో్‌షకు సంబంధం లేదని ఖండించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి  5 గంటల వరకు ఆందోళన చేపట్టారు.  నిందితులను అరెస్టు చేసేంత వరకు ఆందోళన   విరమించేది లేదని భీష్మించుకుని  కూర్చున్నారు. జితేందర్‌గౌడ్‌ ఇంటి కిటికీ అద్దాలను, సీసీ కెమెరాలు, పైపులు,  ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మహిళలు పోలీసులపై దాడికి యత్నించారు. రామాయంపేటకు చేరుకున్న ఎస్పీ రోహిణి  ప్రియ దర్శిని మెదక్‌, తూప్రాన్‌, దుబ్బాక, సిద్దిపేట నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ఆందోళనకారులను సముదాయించారు. పరిస్థితి చేయి దాటకుండా అక్కడే ఉండి సమీక్షించారు. గంటన్నర పాటు రామాయంపేటలోనే ఉన్న ఎస్పీ మృతుల  బంధువులతో పలుమార్లు మాట్లాడారు.  పకడ్భందీగా సెక్షన్లు వేసి నిందితులను  చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సాయంత్రం 5 గంటల తర్వాత భారీ పోలీసు బందోబస్తు మధ్య రామాయంపేట శివారులోని శ్మశానవాటికకు మృతదేహాలను తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. 



Updated Date - 2022-04-17T05:40:40+05:30 IST