రజకవృత్తికి టెక్‌ సొబగులు

ABN , First Publish Date - 2022-05-18T05:35:24+05:30 IST

రజకవృత్తికి టెక్‌ సొబగులు వచ్చాయని, షిఫ్టుల వారీగా వందలాది రజకులకు ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రజక వృత్తిదారులను ఆధునిక టెక్నాలజీ వైపు మళ్లించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ఎర్రచెరువు దోభీఘాట్‌లో అధునాతన శారీ, బెడ్‌ షీట్‌ రోలింగ్‌ మెషీన్లు, టాటా ఏస్‌ వాహనాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారరు.

రజకవృత్తికి టెక్‌ సొబగులు
సిద్దిపేట పట్టణంలోని దోభీఘాట్‌లో అధునాతన శారీ, బెడ్‌షీట్‌ రోలింగ్‌ మిషన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు


షిఫ్టుల వారీగా వందలాది మందికి ఉపాధి 

శారీ, బెడ్‌ షీట్‌ రోలింగ్‌ మెషీన్ల ఏర్పాటు

సిద్దిపేట మోడ్రన్‌ దోభీఘాట్‌ రాష్ట్రానికే ఆదర్శం 

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, మే 17: రజకవృత్తికి టెక్‌ సొబగులు వచ్చాయని, షిఫ్టుల వారీగా వందలాది రజకులకు ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రజక వృత్తిదారులను ఆధునిక టెక్నాలజీ వైపు మళ్లించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ఎర్రచెరువు దోభీఘాట్‌లో అధునాతన శారీ, బెడ్‌ షీట్‌ రోలింగ్‌ మెషీన్లు, టాటా ఏస్‌ వాహనాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నాలుగేళ్ల కిందట రాష్ట్రంలోనే మొదటగా రూ.1.40 కోట్లతో సిద్దిపేటలో మోడ్రన్‌మెకనైజ్డ్‌ దోభీఘాట్‌ను నిర్మించుకున్నామని తెలిపారు. గతంలో కోమటిచెరువు వద్ద సంప్రదాయ పద్ధతుల్లో దుస్తులను ఉతికేటప్పుడు సోడా వాడకంతో కాళ్లు, చేతులు దెబ్బతిని ఆరోగ్యం పాడైన సందర్భాలు చూశామని గుర్తుచేశారు. చెరువు నీరు కలుషితమై రకరకాలుగా ఇబ్బందులు తలెత్తేవన్నారు. రజకుల ఆరోగ్యం కాపాడటంతో పాటు, ఉపాధి లభించేలా రూ.1.10 కోట్లతో మెకనైజ్డ్‌ శారీ రోలింగ్‌, బెడ్‌ షీట్‌ రోలింగ్‌ మెషీన్లను రాష్ట్రంలోనే మొదటిసారిగా సిద్దిపేటలో ఏర్పాటు చేసుకున్నామని మంత్రి వివరించారు. సిద్దిపేట మోడ్రన్‌ దోభీఘాట్‌ రాష్ట్రానికే ఆదర్శమన్నారు. పట్టణంలో హోటళ్లు, ఆసుపత్రులు, వివిధ వ్యాపార సంస్థల నుంచి వస్త్రాలను తీసుకుని రావడం, తిరిగి ఇచ్చి వెళ్లేందుకు రవాణా కోసం రూ.6 లక్షలతో టాటా ఏస్‌ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. రజకులకు మరింత గిరాకీ పెరగాలని, లాభాలు రావాలని, ఎక్కువ మంది లబ్ధి పొందాలని మంత్రి ఆకాంక్షించారు. రజకుల వృత్తిని ప్రోత్సహించాలని, బయట ప్రైవేటు డ్రైక్లీనింగ్‌ బదులుగా ఈ కమ్యూనిటీకి దుస్తులు ఇవ్వాలని మంత్రి పట్టణ ప్రజలను కోరారు. మోడ్రన్‌ దోభీఘాట్‌లో ప్రత్యేకతలను మంత్రి హరీశ్‌రావు వివరించారు. 30 కిలోల కెపాసిటీ కలిగిన 3 వాషింగ్‌ మెషీన్లు, 3 స్పిన్నర్లు, 3 డైయ్యర్లు, ఇస్త్రీ చేయడానికి 3 ఐరన్‌ ఎలక్ట్రికల్‌ టేబుల్స్‌ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 8 గంటల్లోనే టన్ను బరువు బట్టలు ఉతికే సామర్థ్యాన్ని ఈ దోభీఘాట్‌ కలిగిఉందన్నారు. దీంతో పట్టణంలోని 500 మంది రజకులకు పనిభారం తగ్గిందని వివరించారు. శారీ, బెడ్‌ షీట్‌ రోలింగ్‌ విధానంతో అతి తక్కువ సమయంలో దుస్తులను పొడిగా చేయడంతో పాటు నాణ్యత, మెరుగు దెబ్బ తినకుండా ఉంటుందని తెలిపారు. ఈ ఆటోమాటిక్‌ యంత్రం ద్వారా గంటకు 20 నుంచి 30 చీరలు రోజుకు 500 రోలింగ్‌ చేయగలిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, మున్సిపల్‌ కౌన్సిలర్‌ శ్రీలతశ్రీహరి, సుడా డైరెక్టర్‌ మచ్చవేణుగోపాల్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, బీసీ కార్పోరేషన్‌ ఈడీ సరోజ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళవారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువు వద్ద ఏర్పాటు చేసిన వరల్డ్‌ వండర్‌ గేమింగ్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం కాసేపు ఆటోమేటిక్‌ సిమిలేటడ్‌ క్రికెట్‌ను హరీశ్‌రావు సరదాగా ఆడారు. అనంతరం గేమింగ్‌ జోన్‌లో చిన్నారులు ఆట పరికరాలను పరిశీలించారు. 


గ్రామానికో ధాన్యం కొనుగోలు కేంద్రం

సిద్దిపేట అగ్రికల్చర్‌, మే 17: గతంలో మండలానికి లేదా ఐదారు గ్రామాలకు కలిపి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండేదని, కానీ ధాన్యం దిగుబడి పెరగడంతో ప్రస్తుతం ప్రతీ గ్రామానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని  మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మహిళా సంఘాలకు 2020-21 సీజన్‌కు సంబంధించి వరిధాన్యం కొనుగోలు కమిషన్‌ రూ.4.61 కోట్లు,  2018-19 సంవత్సరానికి 11 పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న కమీషన్‌ రూ.75.22 లక్షల చెక్కును మంత్రి హరీశ్‌ రావు మండల సమాక్యలకు, గ్రామైక్య సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే స్థాయి నుంచి పనికోసం తెలంగాణ రాష్ట్రానికి వలసవచ్చే స్థాయికి చేరామన్నారు. ధాన్యాన్ని దింపడానికి బీహారివాసులు, నాట్లు వేయడానికి కూలీలుగా పశ్చిమ బెంగాల్‌ నుంచి పురుషులు రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, డీఆర్డీవో గోపాల్‌రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-05-18T05:35:24+05:30 IST