కొలువుకు సోపానం.. రాజు శిక్షణ కేంద్రం

ABN , First Publish Date - 2022-12-02T00:14:42+05:30 IST

పోలీస్‌ అభ్యర్థులకు అండగా తడకపల్లిలో ఉచిత శిక్షణ

కొలువుకు సోపానం.. రాజు శిక్షణ కేంద్రం
పోలీస్‌ ఉచిత శిక్షణ కేంద్రంలో అభ్యర్థులు

సిద్దిపేట అర్బన్‌, డిసెంబరు 1 : పోలీసు కొలువు కలను సాకారం చేసే దిశగా ఉచిత శిక్షణ అందిస్తున్నాడు తడకపల్లికి చెందిన తిగుళ్ల రాజు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని పోలీస్‌ కావాలన్న తన కలను కనీసం తన శిక్షణ ఇస్తున్న అభ్యర్థులలోనైనా చూడాలని ఈ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఎంపెడ్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన రాజు ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగంలో స్థిరపడ్డాడు. త్వరలో పోలీస్‌ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించనుండగా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఆయన ముందుకొచ్చారు. తన స్వగ్రామమైన తడకపల్లిలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట ఎనిమిది మంది అభ్యర్థులతో ప్రారంభమైన కేంద్రం రానురాను 40 మంది అభ్యర్థులకు చేరుకున్నది. గతంలో మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన పోలీస్‌ శిక్షణ కేంద్రంలో కోచింగ్‌ ఇచ్చిన రాజుకు అనుభవం ఉండడంతో అభ్యర్థులు ఈ శిక్షణ కేంద్రంలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. తాను కూడా ఎటువంటి లాభాన్ని ఆశించకుండా అభ్యర్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటూ శిక్షణ ఇస్తున్నాడు. గ్రామంలో ఉన్న నేతలతో మాట్లాడి అభ్యర్థులకు కావలసిన డ్రెస్‌, షూ, స్నాక్‌ వంటివి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం అభ్యర్థులకు శిక్షణనిస్తూ కావలసిన మెలకువలను నేర్పిస్తున్నారు. ఉద్యోగం సాధించాలన్న తపన కలిగిస్తూ ముందుకు తీసుకెళుతున్నారు.

కఠోర శిక్షణనిస్తున్నాం

8 మందితో ప్రారంభమైన నా ఉచిత శిక్షణా కేంద్రం నేడు 40 మందికి చేరుకున్నది. అభ్యర్థులకు కఠోర శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకొని మెరిట్‌ సాధించి ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నా.

- తిగుళ్ల రాజు, కోచ్‌

Updated Date - 2022-12-02T00:15:32+05:30 IST