పశువుల కొట్టాల్లో క్రీడా మైదానాలు!
ABN , First Publish Date - 2022-10-08T04:22:46+05:30 IST
సంగారెడ్డి మండలానికి మొత్తంగా 16 గ్రామీణ క్రీడా మైదానాలు మంజూరయ్యాయి. కానీ మండలంలోని కొన్ని గ్రామాల్లో అనువైన ప్రభుత్వ స్థలం దొరకకపోవడంతో అధికారులు సిగపట్లు పడుతున్నారు.
స్థలాలు దొరకక అధికారుల సిగపట్లు
తప్పని ఉన్నతాధికారుల ఒత్తిడి
సంగారెడ్డి రూరల్, అక్టోబరు 7: గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడారంగంపై ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. సంగారెడ్డి మండలంలో 11 గ్రామ పంచాయతీలు కొత్లాపూర్, నాగాపూర్, ఇర్గిపల్లి, కల్పగూర్, కులబ్‌గూర్, ఫసల్‌వాది, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, గంజిగూడెం, హనుమాన్‌నగర్, గుడితాండ, తాళ్లపల్లి ఉన్నాయి. కల్పగూర్ గ్రామ పంచాయతీకి మదిర గ్రామాలు అంగడిపేట, గంజిగూడెం, కులబ్‌గూర్ గ్రామ పంచాయతీకి సదాశివనగర్, మహ్మద్‌షాపూర్, హనుమాన్‌నగర్ గ్రామ పంచాయతీకి దాసుగడ్డ తండా మదిర గ్రామాలున్నాయి. సంగారెడ్డి మండలానికి మొత్తంగా 16 గ్రామీణ క్రీడా మైదానాలు మంజూరయ్యాయి. కానీ మండలంలోని కొన్ని గ్రామాల్లో అనువైన ప్రభుత్వ స్థలం దొరకకపోవడంతో అధికారులు సిగపట్లు పడుతున్నారు. క్రీడా మైదానాల ఏర్పాటు వివరాలు సమర్పించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో రాళ్లు రప్పలు ఉన్నా స్థలాలు, పశువుల కొట్టాలు ఉన్న స్థలాల్లో గ్రామీణ క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. అలాంటి స్థలాల్లో ఆటలు ఎలా ఆడతామని క్రీడాకారులు వాపోతున్నారు. మండలానికి 16 క్రీడా మైదానాలు మంజూరయినా ఇంకా నాలుగు గ్రామాల్లో స్థలం దొరకకపోవడంతో అధికారులు అన్వేషిస్తున్నారు.