సిద్దిపేట.. భావి తరాలకు అభివృద్ధి బాట

ABN , First Publish Date - 2022-12-16T23:56:51+05:30 IST

సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే భావితరాలకు అభివృద్ధి బాట ను వేశారని ఫిర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు.

సిద్దిపేట.. భావి తరాలకు అభివృద్ధి బాట
సిద్దిపేటలోని బుస్సాపూర్‌ రీసోర్స్‌ పార్కును సందర్శించిన ఫిర్జాదిగూడ మేయర్‌, బృందం

ఫిర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి

సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 16: సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే భావితరాలకు అభివృద్ధి బాట ను వేశారని ఫిర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని స్వచ్ఛబడి, బుస్సాపూర్‌ రీసోర్స్‌ పార్కు, డీఆర్‌సీసీలలో ఫిర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ రామకృష్ణారావు, డీఈ శ్రీనివా్‌సరావు పర్యటించారు. వారికి సిద్దిపేట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు స్వాగతం పలికి పట్టణ ప్రాముఖ్యాన్ని వివరించారు. స్వచ్ఛ బడిలోని పరిసరాలను, చెత్త నుంచి ఎరువును తయారు చేసే విధానాన్ని, చెత్తను ప్రజలు మూడు రకాలుగా వేరు చేసి ఇచ్చే విధానాన్ని, బుస్సాపూర్‌ డంపింగ్‌యార్డులో బయోగ్యాస్‌ విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛబడిని సందర్శించిన వారికి రాజనర్సు స్వచ్ఛ సిద్దిపేట యొక్క గోడ గడియారాలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఫిర్జాదిగూడ మేయర్‌ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛబడి ద్వారా ఇంట్లో ప్రతిరోజూ వెలువడే తడి చెత్తతో ఎరువు తయారీ చేసే విధానంపై ప్రొజెక్టర్‌ ద్వారా వివరించడం, ప్లాస్టిక్‌ని పూర్తిస్థాయిలో నిషేధిస్తూ పూర్వ పద్ధతిలో స్టీల్‌ పేట్లు, గ్లాస్‌లను వాడే విధానం బాగుందన్నారు. జీరో వేస్ట్‌ హోమ్‌లో తెలుసుకోవడం, మొక్కల పెంపకం వంటివి, స్వచ్ఛ బడి ద్వారా పట్టణ ప్రజలకు, విద్యార్థులకు చిన్నవయసులోనే అవగాహన కల్పించడం ఎంతో గొప్ప ఆలోచన అని చెప్పారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధతో ముందు తరాలపట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను అభినందించారు. బుస్సాపూర్‌లో తడిచెత్తతో బయోగ్యాస్‌ తయారు చేయడం, ఆ గ్యాస్‌ను విక్రయించడం అద్భుతమన్నారు. ప్లాస్టిక్‌ను సైతం రీప్రాసెసింగ్‌ యూనిట్‌ ద్వారా ప్లాస్టిక్‌ బ్రిక్స్‌ తయారుచేయడం, వార్డు కంపోస్టు యార్డుల ద్వారా సేంద్రియ ఎరువు తయారీ విధానం బాగుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దీప్తినాగరాజు, కలకుంట్ల మల్లికార్జున్‌, వడ్లకొండ సాయికుమార్‌, మేనేజర్‌ శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:56:52+05:30 IST