శనిగరం ప్రాజెక్టుకు జలకళ
ABN , First Publish Date - 2022-07-29T05:13:54+05:30 IST
కోహెడ మండలంలోని శనిగరం మధ్యతరహ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండుకుండలా మారింది.
కోహెడ, జూలై 28 : కోహెడ మండలంలోని శనిగరం మధ్యతరహ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండుకుండలా మారింది. వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు మండలంలోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ వరద బస్వాపూర్ ఫీడర్ చానల్ ద్వారా శనిగరం ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం ఒక టీఎంసీ కాగా పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నది. దీంతో గురువారం మత్తడి దూకుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా కోహెడ, బెజ్జంకి మండలాల్లోని తొమ్మిది గ్రామాల పరిధిలో 5100 ఎకరాలకు సాగు నీరు అందనుంది.
