రైతువేదికకు దూరంగా గ్రామాల ఎంపిక

ABN , First Publish Date - 2022-12-31T00:01:05+05:30 IST

పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు, రైతులందరూ ఒక చోట సమావేశమై వ్యవసాయరంగంపై చర్చించుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం అల్లాదుర్గం మండలంలో ఏర్పా టు చేసిన రైతువేదికలు అలంకారప్రాయంగా మారాయి.

 రైతువేదికకు దూరంగా గ్రామాల ఎంపిక
అల్లాదుర్గంలో నిర్మించిన రైతు వేదిక భవనం

3 కి.మీ దూరం కాదని 15 కి.మీ దూరంలో ఉన్న క్లస్టర్‌లో విలీనం

కొన్ని క్లస్టర్లలో 10, 15 కి.మీ దూరంలో గ్రామాలు

రెండేళ్లయినా ఒక్క అవగాహన సదస్సుకు కూడా హాజరుకాని రైతులు

అల్లాదుర్గం, డిసెంబరు 30: పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు, రైతులందరూ ఒక చోట సమావేశమై వ్యవసాయరంగంపై చర్చించుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం అల్లాదుర్గం మండలంలో ఏర్పా టు చేసిన రైతువేదికలు అలంకారప్రాయంగా మారాయి. క్లస్టర్‌కు దగ్గరగా ఉన్న గ్రామాలను కాదని చాలా దూరంలో ఉన్న గ్రామాలను ఎంపిక చేయడంతో రైతువేదికలు నిరుపయోగంగా మారాయి. మండలంలోని అల్లాదుర్గం, చేవెళ్ల, చిల్వర్‌, గడిపెద్దాపూర్‌ గ్రామాల్లో క్లస్టర్ల వారీగా ఒక్కో భవనాన్ని సుమారు రూ.22 లక్షల వ్యయంతో నిర్మించారు. కాగా క్లస్టర్ల ఏర్పాటులో సంబంధిత అధికారులు ఇస్టానుసారంగా రైతువేదికకు దూరంగా ఉన్న గ్రామాలను ఎంపిక చేయడంతో రెండేళ్లలో ఈ వేదికలలో రైతులు ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేకపోయారు. గడిపెద్దాపూర్‌ క్లస్టర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని కాయిదంపల్లి గ్రామాన్ని ఈ క్లస్టర్‌లో విలీనం చేశారు. కాగా కాయిదంపల్లి గ్రామం అల్లాదుర్గంనకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ క్లస్టర్‌ను కాదని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గడిపెద్దాపూర్‌లో కలిపారు. ఇదిలా ఉంటే చిల్లర్‌ గ్రామాన్ని ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఈ గ్రామానికి సమీపంలోని మాందాపూర్‌ గ్రామాన్ని కలిపారు. కానీ రైతువేదికను అధికారులు చిల్లర్‌లో నిర్మించకుండా సుమారు 6 కిలోమీటర్ల దూరంలోని ముస్లాపూర్‌లో నిర్మించారు. దీంతో ఒక్క ముస్లాపూర్‌ రైతులకు మాత్రమే ఆ భవనం ఉపయోగపడుతుందని, తమకు దూరంగా ఉండడంతో ఒక్క సమావేశానికి కూడా హాజరు కాలేదని చిల్వర్‌, మాందాపూర్‌ గ్రామ రైతులు వాపోయారు. చేవెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతువేదికకు మండలంలోని ముప్పారం, అప్పాజీపల్లి గ్రామాలను కలపడంతో, క్లస్టర్‌కు ఆ గ్రామాలు 8 కిలోమీటర్ల దూరం నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఆయా గ్రామాల రైతులు కూడా ఈ రైతువేదికలకు దూరంగా ఉంటున్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా కాకుండా అధికారులు ఇస్టానుసారంగా రైతువేదికలను నిర్మించి, గుత్తెదార్లకే ప్రయోజనం చేకూర్చారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేటికి మంజూరు కాని నిర్వహణ డబ్బులు

రైతువేదికల నిర్వహణ కోసం ప్రతీ నెల రూ.9 వేలను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ డబ్బును మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఏఈవోలకు అందజేస్తుంది. ఈ డబ్బుతో రైతువేదికకు సంబంధించి కరెంటు బిల్లు, పారిశుధ్య నిర్వహణ, రైతుల సమావేశాల నిర్వహణతో పాటు చిన్నపాటి మరమ్మతులకు వినియోగించుకోవలసి ఉంటుంది. కానీ ఇంతవరకు ఈ డబ్బులు మంజూరు కాలేదు. నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో సంబంధిత అధికారులు కూడ రైతువేదికలను పట్టించుకోకపోవడంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతువేదికలు శిథిలమయ్యే ప్రమాదం ఉందని ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-31T00:01:06+05:30 IST