ఫిబ్రవరి 5లోగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక

ABN , First Publish Date - 2022-01-24T04:52:45+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

ఫిబ్రవరి 5లోగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక

  మార్చి మొదటి వారంలో యూనిట్ల గ్రౌండింగ్‌

 కార్యాచరణ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి


సంగారెడ్డి టౌన్‌, జనవరి 23: సంగారెడ్డి జిల్లాలో దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు సత్ఫలితాలిస్తుందన్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. మొదటి దశలో ప్రతీ నియోజకవర్గానికి వందమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయడానికి ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయడం, వారి పేరిట దళితబంధు బ్యాంకుఖాతాలు తెరిపించడం, వారు కోరుకున్న యూనిట్‌కు సంబంధించి శిక్షణ ఇవ్వడం, గ్రౌండింగ్‌ పూర్తి చేసి యూనిట్‌ను అందించడం తదితర పనులన్నీ పూర్తి కావాలన్నారు. ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, మార్చి 7లోగా ఎంపిక చేసిన లబ్ధిదారుల మొత్తం యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలన్నారు. ఎలాంటి అప్పు లేకుండా దళితబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వామే రూ.10లక్షలు బ్యాంకుఖాతాలో జమ చేస్తుందన్నారు. ఇందులో రూ.10వేలు లబ్ధిదారులకు రక్షణ నిధిగా ఉంటుందని మంత్రి వివరించారు. ఏదైనా కారణం చేత ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నా, అనారోగ్యం పాలైనా వారిని కాపాడడానికి దళిత నిధిని ఉపయోగిస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో రూ.7,280కోట్లతో మన ఊరు, మన బడి ప్రణాళిక అమలుకు క్యాబినెట్‌ ఆమోదించిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబురావు, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహరావు, హార్టికల్చర్‌ అధికారి సునీత, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆరీడవో శ్రీనివా్‌సరావు, తదితరులు పాల్గొన్నారు. 


Read more