సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శరత్‌

ABN , First Publish Date - 2022-06-12T05:30:00+05:30 IST

సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ఎ.శరత్‌ నియమితులయ్యారు.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శరత్‌

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, జూన్‌ 12 :  సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ఎ.శరత్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన హన్మంతరావు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018 ఆగస్టులో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.హన్మంతరావు సుదీర్ఘ కాలం పాటు ఇక్కడ పని చేశారు. ఏడాదిన్నర కిందట జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో ఆయనను మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆయన మళ్లీ సంగారెడ్డి కలెక్టర్‌గా వచ్చారు. సంగారెడ్డి జిల్లాలో దాదాపు నాలుగేళ్ల పాటు కలెక్టర్‌గా పని చేసిన హన్మంతరావు వివాదరహితుడిగా పేరొందాడు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గా నియమితులైన ఎ.శరత్‌ గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. 

అందరికీ కృతజ్ఞతలు..

జిల్లా కలెక్టర్‌గా సుధీర్ఘ కాలం పాటు పని చేసిన తనకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పూర్తిగా సహకరించారని బదిలీ అయిన కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు. అందరి సహకారం వల్లే తాను ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశానన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేయడం తనకు సంతృప్తినిచ్చిందని, సహకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.


Updated Date - 2022-06-12T05:30:00+05:30 IST