పదో తరగతి పరీక్షల కోసం యజ్ఞంలా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-12-30T23:46:59+05:30 IST

విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తొలిమెట్టులాంటి పదో తరగతి పరీక్షల కోసం ఉపాధ్యాయులు యజ్ఞంలా పనిచేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు.

పదో తరగతి పరీక్షల కోసం యజ్ఞంలా పనిచేయాలి

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఇదే పునాది

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌

పరీక్షలపై ఉపాధ్యాయులతో సమావేశం

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 30 : విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తొలిమెట్టులాంటి పదో తరగతి పరీక్షల కోసం ఉపాధ్యాయులు యజ్ఞంలా పనిచేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థి భవిష్యత్తుకు పదో తరగతి పునాది లాంటిదని, మన సొంత బిడ్డల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తామో అదేవిధంగా విద్యార్థుల గురించి ఆలోచించాలని సూచించారు. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్దేశించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు అవరసమైన చోట సబ్టెక్టు టీచర్లను స్థానికంగా నియమించుకోవడానికి ప్రధానోపాధ్యాయులకు అనుమతినిస్తామని స్పష్టం చేశారు. ప్రతీ పాఠశాలకు అవసరమైన సహకారాన్ని అందజేయడానికి ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని వెల్లడించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలకు స్నాక్స్‌ ఇచ్చేందుకు పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కలెక్టర్‌ కోరారు. అందరి భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, డీఈవో రాజేష్‌, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:46:59+05:30 IST

Read more