శరవేగంగా మినీ ఐవోసీ కాంప్లెక్సుల నిర్మాణం

ABN , First Publish Date - 2022-10-02T05:07:13+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాలన్ని ఒకే గొడుగు కింద ఏర్పాటు చేసి, ప్రజలకు ప్రభుత్వ పౌర సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లను ఏర్పాటు చేసింది.

శరవేగంగా మినీ ఐవోసీ కాంప్లెక్సుల నిర్మాణం
మర్కుక్‌ మండల కేంద్రంలో నిర్మిస్తున్న మినీ ఐవోసీ కాంప్లెక్స్‌

మండలంలోని అన్ని కార్యాలయాలు ఒకే గొడుగు కిందికి

సీఎం ఇలాకాలో ఏడు మండలాలకు రూ.70కోట్లు

గజ్వేల్‌, అక్టోబరు 1: ప్రభుత్వ కార్యాలయాలన్ని ఒకే గొడుగు కింద ఏర్పాటు చేసి, ప్రజలకు ప్రభుత్వ పౌర సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లను ఏర్పాటు చేసింది. ఇదే మాదిరిగా మండల కేంద్రాల్లోనూ మినీ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్సుల(మినీ ఐవోసీ)ను నిర్మించి ప్రజలకు పౌరసేవలను ఒకే గొడుగుకిందకు తీసుకురానుంది. వీటి నిర్మాణంతో మండలకేంద్రాల్లో తలో చోట ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు కానున్నాయి. మండలంలోని తహసీల్దార్‌, ఎంపీడీవో, ఆయా ఇంజనీరింగ్‌ విభాగాలు, కాన్ఫరెన్స్‌ హాల్‌, సమావేశ మందిరాలను ఈ మినీ ఐవోసీల్లో నిర్మించనున్నారు. 

 మూడు నెలల్లో పూర్తి చేసేందుకు కసరత్తు

ఈ మినీ ఐవోసీ కాంప్లెక్సులను నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ కింద రూ.10 కోట్ల చొప్పున నియోజకవర్గంలోని తూప్రాన్‌, ములుగు, జగదేవ్‌పూర్‌, వర్గల్‌, కొండపాక, మర్కుక్‌, మనోహరాబాద్‌ మండలాలకు నిధులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పనులను రెండు నెలల క్రితం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించగా, పనులు చకచకా సాగుతున్నాయి. వాస్తవానికి దీపావళి వరకు మినీ ఐవోసీలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించినా, ఇటీవల కురిసిన వర్షాలకు పనులు మందగించాయి. కాగా సంక్రాంతి వరకు పూర్తిస్థాయిలో నిర్మాణాలను పూర్తి చేసి, కార్యాలయాల్లో పనులను ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తూప్రాన్‌లో నిర్మించనున్న ఐవోసీలో ఆర్డీవో కార్యాలయంతో పాటు డీఎల్‌పీవో కార్యాలయాలు రానున్నాయి. ములుగులో సబ్‌ డివిజన్‌ కార్యాలయాలైన ఇంజనీరింగ్‌ విభాగాలు, వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయాలు రానున్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాలైన మనోహరాబాద్‌, మర్కుక్‌లో సైతం నిర్మాణాలు సాగుతున్నాయి. ఇటీవలే కొత్తగా కొండపాక మండలంలోని కుకునూర్‌పల్లిని మండలకేంద్రంగా ఏర్పాటు చేసింది. ఈ మండలకేంద్రంలో సైతం మినీ ఐవోసీని నిర్మించేందుకు నివేదికలను పంపాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. సంక్రాంతి వరకు మినీ ఐవోసీలను అందుబాటులోకి తీసుకువస్తామని ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు.


Read more