సమస్యలను సత్వరం పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-06-08T05:00:14+05:30 IST

పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు, కౌన్సిలర్లు, అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు.

సమస్యలను సత్వరం పరిష్కరించాలి

  పట్టణ ప్రగతిని విజయవంతం చేయండి

 టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు సూచన


సిద్దిపేట టౌన్‌, జూన్‌ 7: పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు, కౌన్సిలర్లు, అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో కంటి క్యాటారాక్ట్‌, మోకాలి చిప్ప ఆపరేషన్లు అంశాలతో పాటు పట్టణప్రగతి, హరితహారం, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతీ వార్డులో ప్రత్యేక కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, కంటి సమస్యలతో బాధపడే వారిని గుర్తించి కంటి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయిస్తే ఒక్కొక్కరు రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు లబ్ధిపొందుతారని చెప్పారు. మోకాలి చిప్ప ఆపరేషన్లు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నట్లు వార్డుల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని మంత్రి ఆదేశించారు. సిద్దిపేట  పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపడుతున్న పట్టణప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వార్డులు, కాలనీల్లోని సమస్యలను అక్కడే పరిష్కరించాలని కౌన్సిలర్లు, వార్డుస్థాయి పార్టీ నాయకులకు సూచించారు. వర్షాకాలం వస్తున్నందున పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేట పట్టణం మెరుగైన ర్యాంకు సాధించే విధంగా అన్ని విభాగాలు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


 

Read more