అమ్మకు శిక్షణ.. బిడ్డకు రక్షణ

ABN , First Publish Date - 2022-05-22T05:56:41+05:30 IST

సిద్దిపేట జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తొంభై శాతానికి పైగా గర్భిణులకు సిజేరియన్లు చేస్తున్నారు. నార్మల్‌ డెలివరీలపై కనీస అవగాహన కూడా కల్పించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం సిజేరియన్లను తగ్గించి నార్మల్‌ డెలివరీలను పెంచడంపై దృష్టి సారించారు. 60 శాతం వరకు సాధారణ కాన్పులు చేస్తున్నారు. ఇందుకోసం గర్భిణులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.

అమ్మకు శిక్షణ.. బిడ్డకు రక్షణ
సిద్దిపేట జనరల్‌ ఆస్పత్రిలో గర్భిణులకు శిక్షణ ఇస్తున్న నర్సు

సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో గర్భిణులకు ప్రత్యేక వ్యాయామ శిక్షణ

సాధారణ కాన్పులపై అవగాహన

సర్కారు దవాఖానాలో వినూత్న కార్యక్రమం

ఇప్పటి వరకు వెయ్యి మందికి శిక్షణ


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 21: సిద్దిపేట జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తొంభై శాతానికి పైగా గర్భిణులకు సిజేరియన్లు చేస్తున్నారు. నార్మల్‌ డెలివరీలపై కనీస అవగాహన కూడా కల్పించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం సిజేరియన్లను తగ్గించి నార్మల్‌ డెలివరీలను పెంచడంపై దృష్టి సారించారు. 60 శాతం వరకు సాధారణ కాన్పులు చేస్తున్నారు. ఇందుకోసం గర్భిణులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.


గర్భిణులకు ఆసనాలు

గతేడాది నవంబర్‌ 1 నుంచి సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో గర్భిణులకు వ్యాయామం, ఆసనాలు నేర్పిస్తున్నారు. రక్త ప్రసరణ సరిగా ఉంటేనే నార్మల్‌ డెలివరీ సాధ్యం. అందుకే గర్భిణులకు ప్రత్యేకంగా రూపొందించిన ఆసనాలను నేర్పిస్తున్నారు. ఇందుకోసం ఆస్పత్రిలో ప్రొఫెషనల్‌ మిడ్‌వైవ్‌గా శిక్షణ పొందిన నర్సును నియమించారు. ఆమె ఆధ్వర్యంలో గర్భిణులచే గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు పలు ఆసనాలను వేయిస్తున్నారు. దీనిని జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు విస్తరించేందుకు మరింత మంది ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాల్లోని గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. 


సిజేరియన్లు తగ్గుముఖం

వ్యాయామ శిక్షణతోపాటు వైద్యుల కృషితో  సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కడుపు ‘కోత’లు తగ్గుముఖం పడుతున్నాయి. నార్మల్‌ డెలివరీల సంఖ్య పెరుగుతున్నది. నార్మల్‌ డెలివరీలు జనవరి నెలలో 57శాతం, ఫిబ్రవరిలో 55 శాతం, మార్చిలో 62 శాతం, ఏప్రిల్‌లో 65 శాతం, ఈనెలలో ఇప్పటివరకు 68 శాతం జరిగాయి. సిజేరియన్లు 32 శాతానికి పరిమితమయ్యాయి. మాతాశిశు మరణాలు కూడా లేవు. ఆస్పత్రిలో అధునాతన వసతులతోపాటు సరిపడా సిబ్బంది, వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడమే ఇందుకు కారణం. ఇటీవల మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రిని సందర్శించి వైద్యులకు దిశానిర్ధేశం చేశారు. 


తల్లిబిడ్డల ఆరోగ్యం కోసమే : శ్రీలత, నర్సు

సిజేరియన్లతో ఎన్నో సమస్యలు వస్తాయి. నార్మల్‌ డెలివరీ అయితే తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. ఇదే విషయంపై అవగాహన కల్పించి శిక్షణ ఇస్తున్నాం. ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్‌, గైనిక్‌ హెచ్‌వోడీ, గైనకాలజిస్టులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్ల సూచనలు, సలహాల మేరకు ఆసనాలపై శిక్షణ ఇస్తున్నాం. వీటిని గర్భిణులు పాటించడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.


మూడు నెలలు ఆసనాలు : ఆస్మా, పాలమాకుల

మాది నంగునూరు మండలం పాలమాకుల గ్రామం. సిద్దిపేట ఆస్పత్రికి ప్రతీనెల వైద్య పరీక్షల కోసం వచ్చినపుడు నార్మల్‌ డెలివరీపై అవగాహన కల్పించారు. కొన్ని వ్యాయామ ఆసనాలు నేర్పించారు. మూడు నెలలపాటు ఇంట్లోనే ఆసనాలు అనుసరించాను. నార్మల్‌ డెలివరీ అయ్యింది. 


ఎనిమిదో నెలలో శిక్షణ : సౌందర్య, వెలికట్ట

ఎనిమిదో నెలలో ఆస్పత్రికి వచ్చినప్పుడు నేర్పించిన ఆసనాలను నెల రోజులు క్రమం తప్పకుండా వేశాను. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నార్మల్‌ డెలివరీ కావడం ముఖ్యమని అవగాహన కల్పించడంతో ఇంట్లో ఆసనాలు సాధన చేశాను. సాధారణ కాన్పు చేశారు. 

Updated Date - 2022-05-22T05:56:41+05:30 IST