పేరుకే ప్రజావాణి

ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST

‘ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కారించాలి. పెండింగ్‌ దరఖాస్తులను కూడా సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చొరవచూపాలి’ అని ప్రతీ సోమవారం ప్రజావాణికి హాజరైన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులను కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు ఆదేశించడం తప్ప పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు శూన్యం.

పేరుకే ప్రజావాణి
ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

దరఖాస్తుల పరిష్కారమేది?

రెండుమూడుసార్లు అర్జీ పెట్టుకుంటున్న బాధితులు  

చిన్నచితకా సమస్యలకే మోక్షం


సిద్దిపేట అగ్రికల్చర్‌, అక్టోబరు 17 : ‘ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కారించాలి. పెండింగ్‌ దరఖాస్తులను కూడా సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చొరవచూపాలి’ అని ప్రతీ సోమవారం ప్రజావాణికి హాజరైన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులను కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు ఆదేశించడం తప్ప పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఫిర్యాదుదారులు ప్రజావాణికి తమ సమస్యపై రెండుమూడుసార్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కు వచ్చి మొర పెట్టుకుంటున్న బాధితుల సమస్య మాత్రం తీరడం లేదు.


ప్రతీ సోమవారం 60కిపైగా అర్జీలు

ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అందుబాటులో ఉన్నప్పుడు కలెక్టర్‌ లేదంటే అదనపు కలెక్టర్లు, డీఆర్వో దరఖాస్తులనైతే స్వీకరిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేమిటి, అర్జీదారులకు అందుతున్న సమాధానమేమిటో వారికే తెలియాలి. ప్రజావాణిలో అర్జీ పెట్టుకుంటే తమ సమస్య పరిష్కరమవుతుందని కోటి ఆశలతో వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతున్నది. నెలలు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతీ సోమవారం ప్రజావాణికి సుమారు 60కిపైగా దరఖాస్తులు వస్తున్నాయి. అందులో చిన్నాచితిక సమస్యలకు మాత్రమే పరిష్కారం లభిస్తున్నది. ప్రధానంగా భూసమస్యలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ముంపు గ్రామాల ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రజావాణిలో ఆయా శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు చెబుతున్న కొంతమంది అధికారులు లెక్క చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరిష్కారం కాకపోవడంతో ఈ సోమవారం పలువురు బాధితులు మళ్లీ ప్రజావాణి గడప తొక్కారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డికి అర్జీ అందజేసి తమ సమస్య పరిష్కరించాలని మొర పెట్టుకున్నారు.


పట్టా భూమిని సీలింగ్‌గా మార్చారు

మేము తాత ముత్తాతల నుంచి వస్తున్న భూమిని సాగు చేసుకుంటున్నాం. మాకు పట్టా భూమిగా ఉంది. ధరణిలో మాత్రం 13 ఎకరాల పట్టా భూములు సీలింగ్‌గా చూపిస్తుందని పరిష్కారం చేయాలని ప్రజావాణిలో మూడుసార్లు ఫిర్యాదు చేశాం. ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకోవడం లేదు. వెంటనే మా సమస్యలు పరిష్కరించి పట్టా భూమిగా మార్చాలని కోరుతున్నాం.             

- మైసంపల్లి రైతులు, నంగునూరు మండలం


అనర్హులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇచ్చారు

అర్హులైన మాకు డబుల్‌ బెడ్‌రూమ్‌ కేటాయించకుండా అనర్హులకు ఇచ్చారు. లిస్టులో మా ఆరుగురి పేరు ఉన్న కావాలనే అధికారులు డబుల్‌ బెడ్‌రూమ్‌ కేటాయించడం లేదు. గతంలో కూడా ప్రజావాణికి ఫిర్యాదు చేసినా స్పందించ లేదని మళ్లీ దరఖాస్తు ఇచ్చాం.

- బాధితులు, కొండపాక గ్రామం


59 జీవోనే రద్దు అయిందని చెబుతున్నారు

సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని కల్వకుంట్ల కాలనీలో   192 గజాలలో ఇల్లు నిర్మించుకున్నాను. 59 జీవోలో దరఖాస్తు చేసుకోగా నాలుగుసార్లు మా ఇంటి దగ్గరకు అధికారులు వచ్చి కొలతలు తీసుకొని వెళ్లారు. అధికారులు చెప్పినట్లుగా మూడుసార్లు డీడీలు తీశాను. అయినా నా ఇల్లు 59 జీవో కింద రిజిస్ట్రేషన్‌ కాలేదు. నేను అధికారుల చుట్టూ 2019 నుంచి తిరుగుతున్నా. ప్రజావాణిలోనూ అనేకమార్లు ఫిర్యాదు చేశా. ఇప్పుడేమో 59 జీవోనే రద్దయిందని అధికారులు చెబుతున్నారు.

- రాజు, ప్రశాంత్‌నగర్‌, సిద్దిపేట


ఎస్సీ కార్పొరేషన్‌ లోన్‌ కోసం నాలుగుసార్లు దరఖాస్తు

ఉపాధి నిమిత్తం ఎస్సీ కార్పొరేషన్‌ లోన్‌ మంజూరు చేయాలని నాలుగుసార్లు దరఖాస్తు పెట్టుకున్నాం. ఎస్సీ కార్పొరేషన్‌ పోస్టింగ్‌ ఇచ్చి తమ వాటాగా బ్యాంకులో డిపాజిట్‌ చేసినా నేటికీ లోన్‌ మంజూరు చేయడం లేదు. లోన్‌ మంజూరు చేసిన వెంటనే మేము ఎంచుకున్న యూనిట్లు కొనుగోలు చేసి ఉపాధి పొందుతాం.

- ఎస్‌.శంకర్‌, కనుకరాజు, తొగుట మండలం


మ్యుటేషన్‌ చేయడం లేదు

నేను కొన్న వ్యవసాయ భూమికి మ్యుటేషన్‌ కోసం మా మండలంలోని అధికారుల చుట్టూ తిరిగాను. అయినా చేయడం లేదు. ప్రజావాణిలో రెండుసార్లు ఫిర్యాదు చేసినా నా పని కావడంలేదు.

- నర్సయ్య, చౌదర్‌పల్లి, వర్గల్‌ మండలం


‘ప్రజావాణి’ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి 

అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి 

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ మీటింగ్‌హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన వినతులు, ఫిర్యాదులను అదనపు కలెక్టర్‌ స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 67 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఈ అర్జీలను అదనపు  కలెక్టర్‌ సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చెన్నయ్య, కలెక్టరేట్‌ ఏవో రెహమాన్‌ వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ముంపు గ్రామ పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

అదనపు కలెక్టర్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి

ముంపు గ్రామ పాఠశాలను మొత్తానికి పట్టించుకోవడం లేదని, కనీసం ఉపాధ్యాయులు లేరని సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డికి మల్లనసాగర్‌ ముంపు గ్రామమైన గజ్వేల్‌ మండలంలోని ముట్రాజుపల్లి పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో మధ్యాహ్నభోజనం పెట్టడం లేదని, ఇంకా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లను అందజేయలేదని, టాయిలెట్లను నిర్మించలేదని అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యాపరంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్‌ వెంటనే స్పందిస్తూ మీ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి శుక్రవారం రోజు తాను వచ్చి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో అదనపు కలెక్టర్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST