పోచారం.. అభివృద్ధికి దూరం

ABN , First Publish Date - 2022-03-05T04:59:45+05:30 IST

పోచారం.. అభివృద్ధికి దూరం

పోచారం.. అభివృద్ధికి దూరం
శిథిలావస్థలో ఉన్న గెస్ట్‌హౌజ్‌

కనిపించని పర్యాటక శోభ 

శిథిలావస్థలో గెస్ట్‌హౌజ్‌లు

ప్రకృతి ప్రేమికులకు వసతుల కరువు


హవేళిఘణపూర్‌, మార్చి 4:  పోచారం జలాశయం ప్రకృతి సౌందర్యాలకు పుట్టినిల్లు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన అభయారణ్యంతో పాటు పోచారం డ్యాం, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంటాయి. ఈ ఫారె్‌స్టలో జింకలు, అడవిపందులు, సాంబార్లు, నెమళ్లు, రకరకాల పక్షులు కనిపిస్తాయి. అయితే పోచారం పర్యాటక అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు ముందుకు సాగడం లేదు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పినా అమలుకు నోచుకోలేదు. వీకెండ్‌లో ఆహ్లాదం కోసం వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పోచారం అభయారణ్యం మెదక్‌ జిల్లా కేంద్రం నుంచి 15 కి.మీ. దూరంలో కామారెడ్డి - మెదక్‌ జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు వీకెండ్సేలో, సెలవు రోజుల్లో మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటకులు అభయారణ్యం తిరిగి చూసేందుకు ప్రత్యేక వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ప్రకృతి అందాలను చూసేందుకు అడవి మధ్యలో వాచ్‌టవర్‌ను నిర్మించారు. అయితే పర్యాటకులకు కనీస సౌకర్యాలను కల్పించడంలో అధికారులు, పాలకులు చొరవ తీసుకోవడం లేదు.

అభయారణ్యంలో నిర్మాణాలపై పర్యవేక్షణ కరువు

పోచారం అభయారణ్యంలోని జంతువుల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ వనవిజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం కూడా నిర్మించారు. ఇవి పర్యాటకులను ఎంతాగానో ఆకట్టుకుంటాయి. కానీ వాటిని పర్యవేక్షించేవారే కరువయ్యారు. అంతేకాకుండా ప్రాజెక్టు సమీపంలో ఉన్న గుట్టపై నిజాం కాలంలో నిర్మించిన గెస్ట్‌హౌజ్‌లు శిథిలావస్థలో ఉన్నా పట్టించుకోవడం లేదు. 

అధికారులు పర్యటించినా అభివృద్ధి శూన్యం

గతేడాది ఆగస్టులో కలెక్టర్‌ హరీష్‌, టూరిజం అధికారులు అభయారణ్యంలో పర్యటించారు. పోచారం ప్రాజెక్టుతో పాటు అటవీప్రాంతాన్ని పరిశీలించారు. సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పోచారం డ్యాం మధ్యలో ఐదెకరాల్లో విస్తరించి ఉన్న గుట్టపై టూరిజం పార్కు ఏర్పాటుతో పాటు రెస్టారెంట్‌ను నిర్మిస్తామని తెలిపారు.  జలాశయంలో సాహస క్రీడలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. లక్నవరం వంతెన తరహాలో కేబుల్‌ బ్రిడ్జి, కేబుల్‌ కారును ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు కూడా సాగలేదు.

 వసతుల లేమి

సెలవు, వారాంతపు రోజుల్లో పర్యాటకులు భారీ సంఖ్యలో డ్యాంను సందర్శిస్తుంటారు. అయితే ఇక్కడ ఉన్న పార్కులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు ధ్వంసమయ్యాయి. వాటికి మరమ్మతు చేయడంతో పాటు మరిన్ని ఆటవస్తువులను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఇక్కడకు వచ్చిన పర్యాటకులకు తాగేందుకు నీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదు. అంతేకాకుండా ప్రాజెక్టుకు వెళ్లేందుకు మట్టిరోడ్డే దిక్కు. 

బోట్‌ సౌకర్యం ఏడాదికే పరిమితం 

పోచారం జలాశయం వర్షాకాలంలో నిండుకుండలా ఉంటుంది. దీంతో జలాశయంలో బోటింగ్‌ సౌకర్యం కల్పించారు. కానీ అది ఒక్క ఏడాదికే పరిమితమైంది. 2016లో అప్పటి రాష్ట్ర క్రీడల, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఈ ప్రాంతాన్ని పర్యటించి అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామన్నారు. అప్పటి కలెక్టర్‌ భారతీ హోళికేరి చొరవతో రెండు పడవలను ఏర్పాటు చేసి, బోటింగ్‌ సౌకర్యం కల్పించారు. ఏడాది పాటు పర్యాటకుల జలవిహారం  సాగింది. ఆ తర్వాత రెండు పడవలు పాడవ్వడంతో మూలకు చేరాయి. ఇప్పటి వరకు వాటి మరమ్మతును ప్రజాప్రతినిధులు,  ఉన్నతాధికారులు పటించుకోవడం లేదు.


ప్రతిపాదనలు పంపించాం

- శ్రీనివాస్‌, జిల్లా ఇన్‌చార్జి పర్యాటక అధికారి

ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. ఉన్నత అధికారుల బృందం ఇక్కడ ఉన్న ఇబ్బందులను, వసతులను పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు. ఆదేశాలు రాగానే పనులు చేపడుతాం.  



Updated Date - 2022-03-05T04:59:45+05:30 IST