వడ్లు ఎట్ల కొనాలె?
ABN , First Publish Date - 2022-10-08T05:23:17+05:30 IST
ధాన్యం కొనుగోలు చేసి ఏడాది గడుస్తున్నా కమీషన్ చెల్లించకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందని కమీషన్
పది రోజుల్లో వరి కోతలు షురూ.. ఇప్పటికీ రాని గత రెండు సీజన్‌ల కమీషన్
పెండింగ్‌లో రూ.30 కోట్లు.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల గగ్గోలు
మెదక్, అక్టోబరు 7 : ధాన్యం కొనుగోలు చేసి ఏడాది గడుస్తున్నా కమీషన్ చెల్లించకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం పీఏసీఎస్, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తున్నది. ఇందుకోసం వారికి కమీషన్ అందజేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో ఖర్చులు నిర్వహకులే భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం కమీషన్‌ను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. గత రెండు సీజన్‌లకు సంబంధించి కమీషన్ డబ్బులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు ఇబ్బందులకు గురవుతున్నారు. 2020-2021 సంవత్సరంలో యాసంగి, వానాకాలం సీజన్‌లకు సంబంధించి కమీషన్ రూ.30 కోట్లు ఇంకా బకాయి ఉంది. కమీషన్ చెల్లించడంలో జరుగుతున్న జాప్యంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేయడానికి, గన్నీ బ్యాగులు తెప్పించడానికి ఆటోల కిరాయిలు తదితరాలు స్వయంగా చెల్లించామని, ప్రభుత్వం నుంచి కమీషన్ రాకపోవడంతో తమ జేబులు ఖాళీ అయ్యాయని పేర్కొంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు.
డీఆర్‌డీఏ కార్యాలయానికి చేరని ‘యూసీ’లు
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ నిమిత్తం నిర్వాహకులకు కమీషన్ చెల్లించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో 100 ఐకేపీ కేంద్రాలు, 250 జిల్లా ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రాల నుంచి డీఆర్‌డీఏ కార్యాలయానికి యూసీ అందలేదు. ఈ విషయాన్ని ఇటీవల అడిషనల్ కలెక్టర్, అధికారులు సమీక్షా సమావేశంలో ప్రస్తావించారు. సహకార సంఘాలకు సంబంధించి జిల్లా సహకార కార్యాలయం నుంచి 10 రోజుల క్రితం యూసీ అందినట్లు సమాచారం. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి పది రోజుల్లో కోతలు ప్రారంభించే అవకాశం ఉన్నది. ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ తరుణంలో గత సీజన్లకు సంబంధించిన కమీషన్ రాకపోవడంతో ఈసారి కేంద్రాలను ఎలా నడిపించాలని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి కమీషన్ విడుదల చేయాలని కోరుతున్నారు.