టెట్‌లో వందశాతం ఫలితాలు సాధించాలి

ABN , First Publish Date - 2022-05-15T05:29:32+05:30 IST

టెట్‌ కోచింగ్‌తో వందశాతం ఫలితాలను సాధించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సిద్దిపేటలో మంత్రి స్వయంగా నిర్వహిస్తున్న ఉచిత టెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో శనివారం అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.

టెట్‌లో వందశాతం ఫలితాలు సాధించాలి
స్టడీ మెటీరియల్‌తో మంత్రి హరీశ్‌రావు

అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పిస్తా

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట అర్బన్‌, మే 14 : టెట్‌ కోచింగ్‌తో వందశాతం ఫలితాలను సాధించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సిద్దిపేటలో మంత్రి స్వయంగా నిర్వహిస్తున్న ఉచిత టెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో శనివారం అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ టెట్‌ తర్వాత గ్రూప్‌ 2, 3, 4తో పాటు డీఏస్సీ కోసం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలియజేశారు. అన్ని పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతరం శిక్షణ, తర్ఫీదు ఉంటుందని చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కేసీఆర్‌ టెట్‌ శిక్షణా శిబిరంలో శిక్షణార్థులు సీరియస్‌ నెస్‌తో ఉండాలన్నారు. సమయం చాలా విలువైందని, పోయిన కాలం తిరిగి రాదని, ఈ టెట్‌ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. 2,567 మంది స్ర్కీనింగ్‌ టెస్టులో 1,403 అర్హత సాధిస్తే, శిక్షణ కోసం 731 మంది వస్తున్నారని, వారిలో నిత్యం 686 మంది వస్తున్నట్లు తెలిసిందన్నారు. శిక్షణ తరగతులు సీరియ్‌సగా జరుగుతున్న దృష్ట్యా క్రమశిక్షణతో హాజరై టెట్‌లో అర్హత సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. గతేడాది వెయ్యికి 800 మంది టెట్‌లో అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి 30 వరకు పరీక్షలు అనే భయంపోవాలని, ఒకపూట శిక్షణ తరగతులు, మరొక పూట పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు. అందరికీ మంచి స్టడీ మెటీరియల్‌ ఇస్తున్నామని, అందరూ సీరియ్‌సగా శ్రద్ధ తీసుకోవాలని మంత్రి కోరారు.


భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా సిద్దిపేట

అభివృద్ధిలో సిద్దిపేట అగ్రగామిగా ఉందని ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షా పేపర్‌లో సిద్దిపేట స్వచ్ఛబడి పేరున ప్యాసేజ్‌ రూపంలో 4 మార్కుల ప్రశ్న వచ్చిందని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా పశువులకు హాస్టల్స్‌, చెత్తపై పెద్దలకు స్వచ్ఛబడి ఏర్పాటు చేశామని, భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా సిద్దిపేట నిర్మాణం అవుతున్నదని, అన్ని రంగాల్లో గుణాత్మక మార్పు వచ్చి ఆదర్శంగా నిలిచినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర ఆదాయం రెట్టింపుగా ఉన్నదని, తెలంగాణ రాష్ట్రం చరిత్ర తిరగ రాసిందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మనం వలస పోయామని, ప్రస్తుతం ఇతర రాష్ర్టాల కార్మికులు ఇక్కడికి పని కోసం వస్తున్నారని తెలిపారు.



Updated Date - 2022-05-15T05:29:32+05:30 IST