అడ్డుకున్నోల్లే అక్షింతలు వేస్తున్నారు

ABN , First Publish Date - 2022-03-05T05:05:16+05:30 IST

మల్లన్నసాగర్‌ను అప్పుడు అడ్డుకున్నోళ్లే నేడు పూలు వేసి, పూజలు చేసి పసుపు కుంకుమలతో అక్షింతలు వేసి పోతున్నారని, ప్రజలు దీన్ని గమనించాలని ఎంపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

అడ్డుకున్నోల్లే అక్షింతలు వేస్తున్నారు
మల్లన్నసాగర్‌ నుంచి దుబ్బాక కెనాల్‌కు గోదావరి జలాలను విడుదల చేస్తున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు ఫారూక్‌హుస్సేన్‌, యాదవరెడ్డి

  మల్లన్నసాగర్‌ నుంచి దుబ్బాక కెనాల్‌ ద్వారా మూడు నియోజకవర్గాలకు  సాగునీరు

 దుబ్బాక ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది

 ఎంపీ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి


తొగుట, మార్చి 4: మల్లన్నసాగర్‌ను అప్పుడు అడ్డుకున్నోళ్లే నేడు పూలు వేసి, పూజలు చేసి పసుపు కుంకుమలతో అక్షింతలు వేసి పోతున్నారని, ప్రజలు దీన్ని గమనించాలని ఎంపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి మల్లన్నసాగర్‌ నుంచి కెనాల్‌ ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి గోదావరి జలాలను తుక్కాపూర్‌ వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగమ్మకు సారే సమర్పించి పూజలు చేసి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నేటికీ నెరవేరిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట తప్పకుండా మల్లన్నసాగర్‌ పూర్తి చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అదృష్టమన్నారు. దుబ్బాక కెనాల్‌ ద్వారా మూడు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. తుక్కాపూర్‌ నుంచి కాలువ ప్రారంభమై సిద్దిపేట నియోజకవర్గం దాటి దుబ్బాక నియోజకవర్గంలోని చెల్లాపూర్‌ వరకు కాలువ ద్వారా నీరు చేరుతుందని తెలిపారు. అక్కడి నుంచి కొత్త కెనాల్‌ ద్వారా చీకోడు, పోతారం, గంభీర్‌రావుపురం మీదుగా అప్పర్‌ మానేరు ప్రాజెక్ట్‌ శిలాజీనగర్‌ వరకు నీరు చేరేలా కాలువ డిజైన్‌ చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో.. మంత్రి ఆదేశం మేరకు సాగునీటిని విడుదల చేసినట్లు ఎంపీ వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలకు కాలువ ద్వారా గ్రామ గ్రామాన సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కేఎన్‌ఆర్‌   కంపెనీలోకి వెళ్లారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ అదనపు టీఎంసీ కాలువ కోసం భూమి కోల్పోయిన నిర్వాసితులకు రావాల్సిన పూర్తి పరిహారం అందించాలని కాంట్రాక్టర్‌ను, అధికారులను ఆదేశించారు. అదే విధంగా దుబ్బాక కెనాల్‌ పైన మెట్టు - ఎల్లారెడ్డిపేట గ్రామాల మధ్యలో బ్రిడ్జిని నిర్మించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూక్‌హుస్సేన్‌, యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ భూంరెడ్డి, సిద్దిపేట సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు బస్వరాజ్‌, సాయిబాబా, టీఅర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు, తుక్కాపూర్‌ సర్పంచ్‌ చిక్కుడు చంద్రం, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు హరికృష్ణరెడ్డి, అనిత, కనకయ్య, గోవర్ధన్‌రెడ్డి, విభీషన్‌రెడ్డి, స్వామిరెడ్డి, తోలుకంటి రాజు, అధికారులు పాల్గొన్నారు.


 

Read more