స్నాక్స్‌ లేక ‘పది’ విద్యార్థుల పాట్లు

ABN , First Publish Date - 2022-12-31T22:57:45+05:30 IST

పదో తరగతి పరీక్షల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నది.

స్నాక్స్‌ లేక ‘పది’ విద్యార్థుల పాట్లు

నెలన్నరగా ప్రత్యేక తరగతులు

ఖాళీ కడుపులతోనే చదువులు

చొరవ చూపని అధికారులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 31 : పదో తరగతి పరీక్షల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నది. 2019, 2021లలో రాష్ట్రంలో నాల్గో స్థానంలో ఉన్న సంగారెడ్డి జిల్లా 2022లో మూడో స్థానానికి చేరింది. ఈసారి జిల్లాను నంబర్‌వన్‌గా నిలిపేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తున్నది. కానీ ప్రత్యేక తరగతులకు వచ్చే విద్యార్థులకు కనీసం స్నాక్స్‌ అందించకపోవడంతో ఖాళీ కడుపులతో చదువుపై శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 452 పాఠశాలల్లో 21,363 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరికి నవంబర్‌ 9వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఉదయం 8..30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.05 నుంచి 5.30 గంటల వరకు ఈ తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు వచ్చి సాయంత్రం 5.30గంటల వరకు ఉండాల్సి వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో 80 శాతం సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్నారు. వీరు మధ్యాహ్నం భోజనం చేశాక సాయంత్రం 5.30 గంటల వరకు ఉండాలి. గతంలో జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక నిధులు మంజూరు చేసి, హెడ్మాస్టర్ల ద్వారా విద్యార్థులకు స్నాక్స్‌ ఇచ్చే వారు. అయితే ఈసారి ఇప్పటి వరకు విద్యార్థులకు స్నాక్స్‌ ఇవ్వడం లేదు. ఖాళీ కడుపులతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఎంఈవోలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విడివిడిగా ఇటీవల నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ మాట్లాడుతూ, పదో తరగతి ప్రత్యేక తరగతులకు వచ్చే విద్యార్థులకు స్నాక్స్‌ ఇచ్చేందుకు అవసరమైన నిధుల కోసం స్థానికంగా దాతల కోసం ప్రయత్నించాలని కోరారు. దాతలెవరు అందుబాటులోకి రాకపోతే తన దృష్టికి తేవాలని ఆయన సూచించారు. అయితే ఎంఈవోలు, ఉపాధ్యాయ సంఘాలు మాత్రం దాతల సేకరణ బాధ్యత తహసీల్దార్లకు అప్పగిస్తే బాగుంటుందని అంటున్నారు. స్నాక్స్‌ కోసం గతంలో కలెక్టర్‌ ప్రత్యేకంగా నిధులు ఇచ్చేవారని గుర్తు చేస్తున్నారు. సీఎ్‌సఆర్‌ నిధుల నుంచి కానీ, ఇతర శాఖల నిధులకు బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీలతో కానీ స్నాక్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-12-31T22:57:46+05:30 IST