నూతన మండలంగా నిజాంపేట్‌

ABN , First Publish Date - 2022-07-24T05:47:47+05:30 IST

మండలంలోని నిజాంపేటను నూతన మండలకేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం జీవో నెం.250 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

నూతన మండలంగా నిజాంపేట్‌
నిజాంపేట ఏరియల్‌ వ్యూ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

17 పంచాయతీలతో ఏర్పాటు

మూడు మండలాల నుంచి విలీనం

నారాయణఖేడ్‌, జూలై 23: మండలంలోని నిజాంపేటను నూతన మండలకేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం జీవో నెం.250 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్‌ గత ఫిబ్రవరిలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా నిజాంపేటను నూతన మండలంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ సోమే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపేట మండలంలోకి కల్హేర్‌ మండలం నుంచి 10 గ్రామ పంచాయతీలు, నారాయణఖేడ్‌ మండలం నుంచి 6, పెద్దశంకరంపేట మండలం నుంచి ఒక గ్రామ పంచాయతీని విలీనం చేసి నూతన మండలంగా ప్రకటించారు. నారాయణఖేడ్‌ మండలంలోనే నిజాంపేట అతి పెద్ద గ్రామం. ఈ గ్రామం హైదరాబాద్‌ అకోలా జాతీయ రహదారి 161 పై ఉండడంతో గ్రామస్థులు అనేక సంవత్సరాలుగా తమ గ్రామాన్ని మండలకేంద్రంగా చేయాలని కోరుతున్నారు. దీంతో నిజాంపేట మండలంగా ఏర్పాటు చేసి నారాయణఖేడ్‌ మండలంలోని ర్యాలమడుగు, మాణిక్‌నాయక్‌ తండా, ఈదుల్‌తండా, నిజాంపేట్‌, కొత్తపల్లి, మేగ్యానాయక్‌తండా పంచాయతీలతో పాటు పెద్దశంకరంపేట మండలంలోని జంబికుంటను, కల్హేర్‌ మండలంలోని నాగ్‌ధర్‌ , రాంచందర్‌ తండా, గురుగుచెట్ల తండా, బాచేపల్లి, మీర్ఖాన్‌పేట్‌, మునిగేపల్లి,  బల్కంచెల్క తండా, రాంరెడ్డిపేట్‌, దామర్‌చెరువు, నాగన్‌కుంట తండా, పంచాయతీలతో నిజాంపేటను  ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికుల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 13 మండలాలను ఏర్పాటు చేయడంలో భాగంగా నిజాంపేటను కూడా మండల కేంద్రంగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజాంపేట నూతన మండలంగా ఆవిర్భవించడంతో ఆ గ్రామ రూపురేఖలు మారనున్నాయి. నిజాంపేట మండలంలో 7 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ఉంటాయి. కల్హేర్‌లో ఇప్పటి వరకు 9 ప్రాదేశిక నియోజక వర్గాలు ఉంటే, ప్రస్తుతం 3 నిజాంపేటలో చేరనున్నాయి. నారాయణఖేడ్‌లో 15 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉంటే, ప్రస్తుతం 3 నిజాంపేటలో చేరనున్నాయి. పెద్దశంకరంపేటలోని కమలాపూర్‌ ఎంపీటీసీ పరిధిలోని జంబికుంట నిజాంపేటలో చేర్చారు. దీంతో నిజాంపేటలో దాదాపు 7 ఎంపీటీసీ నియోజకవర్గాలు ఉండనున్నాయి.


Updated Date - 2022-07-24T05:47:47+05:30 IST