హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుపై నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2022-01-09T05:25:12+05:30 IST
దాదాపు 1,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుపై అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొన్నది. ఒక్కసారి నిండితే మూడేళ్లకుపైగా సాగునీటితో పాటు పట్టణ ప్రజలకు తాగునీరందించే ఈ చెరువు అభివృద్ధి దేవుడెరుగు కాని అసలుకే ప్రమాదం ఏర్పడింది. శుక్రవారం రాత్రి ఈ చెరువు తూముకు గండి పడటంతో పెద్దఎత్తున నీరు వృథాగా పోయింది. తాత్కాలికంగా మట్టిపోసినా ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తూముకు గండితో వృఽథాగా పోతున్న నీరు
రెండేళ్ల క్రితమే దెబ్బతిన్న తూము
అయినా మరమ్మతులు చేయని అధికారులు
హుస్నాబాద్, జనవరి 8 : దాదాపు 1,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుపై అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొన్నది. ఒక్కసారి నిండితే మూడేళ్లకుపైగా సాగునీటితో పాటు పట్టణ ప్రజలకు తాగునీరందించే ఈ చెరువు అభివృద్ధి దేవుడెరుగు కాని అసలుకే ప్రమాదం ఏర్పడింది. శుక్రవారం రాత్రి ఈ చెరువు తూముకు గండి పడటంతో పెద్దఎత్తున నీరు వృథాగా పోయింది. తాత్కాలికంగా మట్టిపోసినా ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు సంవత్సరాల క్రితమే ఈ తూము దెబ్బతిని మూసుకుపోగా కనీసం మరమ్మతులు చేపట్టలేదు. అప్పటి నుంచి ఆయకట్టు రైతులకు నీరందించడం లేదు.
నాలుగేళ్లుగా చెరువు అభివృద్ధిపై చిన్నచూపు
నాలుగు సంవత్సరాల క్రితం ఎల్లమ్మచెరువును మినీ ట్యాంక్ బండ్‌గా నిర్మించేందుకు పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. చెరువు ఆధునీకరణకు 2017 సంవత్సరంలో రూ.6.50 కోట్లు మంజూరయ్యాయి. రూ.5.50 కోట్లు పనులతో చేపట్టారు. నీటి పారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ మధ్య అవగాహన లోపంతో ఈ అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా మారాయి. ప్రతిపాదిత పనులకు కాకుండా ఇష్టారీతిగా చేపట్టడంతో నిధులు సరిపోలేదు. దీంతో మినీ ట్యాంక్‌బండ్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం గండిపడిన తూమును రూ.10 లక్షల వ్యయంతో నిర్మించారు. నాణ్యతతో, సరైన సాంకేతికతతో ఈ నిర్మాణం చేపట్టకపోవడంతో చేసిన కొద్ది రోజులకే దెబ్బతిన్నది. నీరు బయటకు పోకుండా మూసుకుపోయింది. దెబ్బతిన్న ఈ తూమును రెండేళ్లుగా అధికారులు మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. ఇదేకాకుండా చెరువు రెండో తూము నుంచి కూడా నీరు లీకవుతున్నది. ఈ చెరువు పనులు పూర్తికి మరో రూ.6 కోట్లు అవసరం ఉండగా ప్రతిపాదనలు పంపించామని అధికారులు తెలిపారు.
అయితే శుక్రవారం రైతులు తూము నుంచి నీటిని విడుదల చేయాలని కోరితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తూమును తీయడంతో గండిపడింది. రాత్రంతా రైతులు, మున్సిపల్ సిబ్బంది కష్టపడి నీరు బయటకు పోకుండా తాత్కాలికంగా మట్టితో మరమ్మతు చేశారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటికీ చెరువును సందర్శించడానికి రాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా తూమును మరమ్మతు చేసి రైతులకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు వేర్వేరుగా గండిపడిన తూమును శనివారం పరిశీలించి మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యంతోనే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు గండిపడి నీరు వృథాగా పోయిందని, ఇందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ చెరువు తూమును అధికారులు పరిశీలించకపోవడం విచారకరమన్నారు.
