ప్రభుత్వ అతిథి గృహం వినియోగంలో నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2022-06-28T04:57:34+05:30 IST
తొగుటలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన అతిథి గృహం నిరుపయోగంగా మారింది. తొగుట గ్రామంలో రూ.లక్షల పంచాయతీ రాజ్ నిధులతో అధునాతన హంగులతో ప్రభుత్వ అతిథి గృహాన్ని అప్పటి దొమ్మాట ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి నిర్మించారు.

చెదలు, తుప్పు పడుతున్న సామగ్రి
పేరుకుపోయిన రూ.85 వేల విద్యుత్ బిల్లు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
తొగుట, జూన్ 27: తొగుటలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన అతిథి గృహం నిరుపయోగంగా మారింది. తొగుట గ్రామంలో రూ.లక్షల పంచాయతీ రాజ్ నిధులతో అధునాతన హంగులతో ప్రభుత్వ అతిథి గృహాన్ని అప్పటి దొమ్మాట ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబునాయుడు 2000 సంవత్సరం జనవరి 9న అట్టహాసంగా ప్రారంభించారు. గృహంలో అధునాతనమైన ఫర్నిచర్, ఏసీలను ఏర్పాటు చేశారు. సిద్దిపేటకు వచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అతిథి గృహంలోనే బస చేసేవారు. ప్రస్తుతం అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అందులో ఉన్న రూ.లక్షలు విలువ చేసే సామగ్రి చెదలు, తుప్పు పట్టి పాడవుతోంది. 2014 ఏప్రిల్ 23న ప్రభుత్వ అతిథి గృహంకు వచ్చిన విద్యుత్ బిల్లును చివరిసారిగా చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు విద్యుత్ బిల్లు చెల్లించక పోవడంతో రూ.85,943 విద్యుత్ బిల్లు పేరుకుపోయింది. దీంతో విద్యుత్ అధికారులు కరెంట్ కనెక్షన్ను కూడా తొలగించారు. కానీ బిల్లు రికవరీని మాత్రం విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు.