టీఆర్‌ఎస్‌ నుంచి మురళీధర్‌యాదవ్‌ సస్పెన్షన్‌!

ABN , First Publish Date - 2022-08-07T06:05:21+05:30 IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌ నుంచి మురళీధర్‌యాదవ్‌ సస్పెన్షన్‌!
విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మారెడ్డి

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించం

టీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మారెడ్డి 


 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఆగస్టు 6: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆయనకు పార్టీలో ఎంతో సముచిత స్థానం కల్పించామన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినీ సహించేది లేదని ఆమె హెచ్చరించారు. శనివారం మెదక్‌లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎ్‌సలో బీసీలకు సరైన స్థానం లేదంటూ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని శుక్రవారం సంగారెడ్డిలో మీడియా ముందు మురళీయాదవ్‌ మాట్లాడిన తీరును ఆమె ఖండించారు. మురళీధర్‌యాదవ్‌ను ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఆయన భార్యను ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా నియమించింది టీఆర్‌ఎస్‌ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పార్టీలో తగిన ప్రాధాన్యతను ఇస్తూ మురళీయాదవ్‌ను గౌరవించామన్నారు. ప్రస్తుతం నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా మురళీధర్‌యాదవ్‌కు టీఆర్‌ఎ్‌సపార్టీ అవకాశం కల్పించిందన్నారు. సమస్యలుంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలే తప్ప రచ్చకెక్కకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ లావణ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, మెదక్‌ పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గంగాధర్‌ పాల్గొన్నారు.


టీఆర్‌ఎస్‌లో గీత దాటితే వేటేనా?

సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ మీడియా ముందు మాట్లాడిన నర్సాపూర్‌ మున్సిపల్‌చైర్మన్‌ ఎర్రగొల్ల మురళీధర్‌యాదవ్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చి వదిలేస్తుండొచ్చని అందరూ భావించారు. కానీ ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన మరుసటి రోజే సస్పెన్షన్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. 


అసమ్మతి నేతలకు అధిష్ఠానం షాక్‌

మురళీధర్‌యాదవ్‌ను సస్పెన్షన్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం పార్టీలోని అసమ్మతి నేతలను షాక్‌కు గురి చేసింది. ఇకపై ఎవరు మితిమీరి మాట్లాడినా ఇలాంటి కఠిన చర్యలే ఉంటాయని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం చెప్పకనే చెప్పింది. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చే వారిపై కఠినంగా వ్యవహరిస్తేనే పార్టీకి మేలు జరుగుతుందని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తున్నట్లుగా అర్థమవుతుంది. 


మురళీధర్‌యాదవ్‌ పయనం బీజేపీ వైపేనా!?

 టీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మురళీధర్‌యాదవ్‌ను పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేయడంతో ఇక ఆయన బీజేపీలో చేరడానికి లైన్‌ క్లియర్‌ అయినట్లుగా భావిస్తున్నారు. ఆగస్టు 21న మురళీధర్‌యాదవ్‌ బీజేపీలో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు మరి కొందరు కీలక నేతలు బీజేపీలో చేరతారని ఆ పార్టీ చేరికల కమిటీ ప్రకటించింది. మురళీయాదవ్‌ కూడా బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. మరి ఆయన బీజేపీలో చేరుతారా? లేక కాంగ్రె్‌సలోకి వెళ్తారా అన్నది ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 


నర్సాపూర్‌ నియోజకవర్గ నేతలను ప్రగతిభవన్‌లో కలిసిన సీఎం

నర్సాపూర్‌, ఆగస్టు 6: నర్సాపూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులను సీఎం కేసీఆర్‌  శనివారం సాయంత్రం ప్రగతిభవనలో ప్రత్యేకంగా కలిశారు. నర్సాపూర్‌ మున్సిపల్‌చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ శుక్రవారం సంగారెడ్డిలో పార్టీపై, సీఎం కేసీఆర్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ క్షమశిక్షణ తప్పారంటూ ఆయనను సస్పెన్షన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గ నేతలతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు మార్కెట్‌కమిటీచైర్‌పర్సన్‌ అనుసూయ అశోక్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌,  పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతితో పాటు పలువురు నాయకులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితితో పాటు పలు అభివృద్ధి విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అలాగే మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ వ్యవహారంపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. మున్సిపల్‌ చైర్మన్‌ మురధర్‌యాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భంగా నియోజకవర్గ నాయకులను సీఎం కలవడం చర్చనీయాంశంగా మారింది. 


వెల్దుర్తిలో ఆందోళన 

వెల్దుర్తి, ఆగస్టు 6: బీసీలను అణదొక్కడమే టీఆర్‌ఎస్‌ పార్టీ ధ్యేయమని గొర్రె కాపరుల సంఘం ఉమ్మడి మెదక్‌ జిల్లా డైరెక్టర్‌ మల్లేశ్‌యాదవ్‌, కుల సంఘాల నాయకులు మహేష్‌ యాదవ్‌, సురేశ్‌ యాదవ్‌, వెంకటేశ్‌ యాదవ్‌, నర్సింహులు, కిష్టయ్య ఆరోపించారు. శనివారం సాయంత్రం వెల్దుర్తిలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. టీఆర్‌ఎ్‌సలో బీసీలకు గుర్తింపు లేదని  నర్సాపూర్‌ మున్సిపల్‌ చైౖర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ పత్రికా ముఖంగా ప్రశ్నిస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ ఆయనను వివరణ అడగాల్సిందిపోయి సస్పెండ్‌ చేయడం ఏంటని వారు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో అగ్రవర్ణాలకే సీఎం పెద్దపీఠ వేస్తున్నారన్నారు. పిడికెడు మంది ఉంది ఉన్న వ్యక్తులకు గంపెడు పోస్టులిచ్చి గంపెడు మంది ఉన్న బీసీలకు పిడెకెడు పోస్టులు ఇస్తూ అణచివేతకు గురిచేస్తున్నారని చెప్పారు.  కేవలం బీసీలను ఎన్నికలప్పుడే వాడుకుంటున్నారని వారు అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని వారు హెచ్చరించారు. 



Updated Date - 2022-08-07T06:05:21+05:30 IST