134 పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు
ABN , First Publish Date - 2022-12-31T22:55:46+05:30 IST
సంగారెడ్డి జిల్లాలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద 134 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
త్వరలో పనులను ప్రారంభించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సంగారెడ్డి టౌన్, డిసెంబరు 31 : సంగారెడ్డి జిల్లాలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద 134 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. హైదరాబాద్ నుంచి శనివారం నాడు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన నూతన పంచాయతీ భవనాల నిర్మాణం పనులను త్వరలో చేపట్టేలా సర్పంచులు చొరవ చూపాలని పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో చెత్తను రిసైక్లింగ్ చేయాలని సూచించారు. హరితహారం మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించాలని, క్రీడా ప్రాంగాణాలను ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి కలెక్టర్ నుంచి అదనపు కలెక్టర్ రాజర్షీషా, డీపీవో సురేష్‌మోహన్, జడ్పి సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమాలపై ప్రచారం చేయాలి
మెదక్ అర్బన్: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం, చెత్తసేకరణ, డంపింగ్‌యార్డ్‌లు, ప్రకృతివనాలు, క్రీడాప్రాంగణాలు, వైకుంఠధామాలు, గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చడం జరిగిందన్నారు. గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలపై గ్రామసభలు నిర్వహించి ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్య కూడళ్లు, గ్రామపంచాయతీల ఎదుట బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆసరా ఫించన్లు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, పంచాయతీ భవనాల నిర్మాణాలు తదితరాల వివరాలను బోర్డులపై నమోదు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా, మండల పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈవో శైలేష్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.