ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు

ABN , First Publish Date - 2022-10-08T05:26:32+05:30 IST

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు
మండల పరిషత్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే, ఎంపీ

ప్రభుత్వ దవాఖానాల్లోనే 80 శాతం ప్రసవాలు

6,200  ఆశ, అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి త్వరలోనే కార్యాచరణ

వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు


చేగుంట, అక్టోబరు 7: ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా చేగుంటలో తహసీల్దార్‌ కార్యాలయం, మండల పరిషత్‌ నూతన భవనాలను ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రసవాల్లో 80 ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. వైద్య సేవలు మెరుగుపడడం, అంగన్‌వాడీ, ఆశావర్కర్ల కృషి ఇందుకు కారణమని తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే 6,200 అంగన్‌వాడీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ వడియారం బైపాస్‌ నుంచి చేగుంట చౌరస్తా మీదుగా రెడ్డిపల్లి బైపాస్‌ వరకు డివైడర్‌ ఏర్పాటు చేయాలని, చేగుంట గజ్వేల్‌ రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మెదక్‌ రోడ్‌లో చేగుంట వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీటీసీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు, సర్పంచ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T05:26:32+05:30 IST