12న ట్రయల్‌రన్‌

ABN , First Publish Date - 2022-06-08T04:58:23+05:30 IST

గౌరవెల్లి రిజర్వాయర్‌లో ట్రయల్‌రన్‌ ఈ నెల 12న నిర్వహిస్తామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు పందిళ్లలో అన్నదానసత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్‌ నియోజకవర్గం గోదావరి జలాలతో సస్యశ్యామలమవుతుందని స్పష్టం చేశారు.

12న ట్రయల్‌రన్‌
పందిళ్లలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

గౌరవెల్లి ప్రాజెక్టు 95 శాతం పూర్తి

నిర్వాసితులకు పైసా బకాయి లేకుండా చెల్లిస్తాం

ప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు అందరూ సహకరించాలి

హుస్నాబాద్‌లో 50 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు

నియోజకవర్గంలోని హెల్త్‌ సబ్‌ సెంటర్లు పల్లె దవాఖానాలుగా మార్పు 

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 


హుస్నాబాద్‌, జూన్‌ 7 :  గౌరవెల్లి రిజర్వాయర్‌లో ట్రయల్‌రన్‌ ఈ నెల 12న నిర్వహిస్తామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు పందిళ్లలో అన్నదానసత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్‌ నియోజకవర్గం గోదావరి జలాలతో సస్యశ్యామలమవుతుందని స్పష్టం చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు 5 శాతం మాత్రమే పెండింగ్‌ ఉన్నాయని, అందరూ సహకరిస్తే వెంటనే పూర్తిచేస్తామని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పైసా బకాయి లేకుండా చెల్లిస్తామని తెలియజేశారు. హుస్నాబాద్‌ ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కిడ్నీ రోగుల కోసం త్వరలోనే 10 పడకల డయాలసిస్‌ సెంటర్‌ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పట్టణంలో రూ. 10 కోట్లతో 50 పడకల మాతాశిశు ఆస్పత్రిని, 10 పడకలతో ఐసీయూ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆస్పత్రిని 130 పడకలు, అన్ని అత్యవసర సేవలతో తీర్చిదిద్దుతామన్నారు. నియోజకవర్గంలోని ఏఎన్‌ఎం సబ్‌సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతీ ఏఎన్‌ఎం సెంటర్‌కు రూ. 20 లక్షలు కేటాయిస్తామని తెలిపారు. హుస్నాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు పనుల కోసం రూ. 12 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. నూతన మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించారు. నియోజకవర్గ కేంద్రంలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనం మరో నెలలో పూర్తవుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే హుస్నాబాద్‌లో ఏసీపీ కార్యాలయ భవన నిర్మాణం చేపడుతామన్నారు. డివిజన్‌లో బీటీ రోడ్ల మరమ్మతుకు రూ. 11 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ పనులను పూర్తిచేస్తామని, నెల రోజుల్లో ఐవోసీ బిల్డింగ్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. హుస్నాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేస్తున్న మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, వైస్‌ చైర్మన్‌ రాజారెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, మార్కెట్‌ కమిటీ చెర్మన్‌ అశోక్‌బాబు, ఎంపీపీలు మానస, లక్ష్మి, జడ్పీటీసీ మంగ, టీటీడీ బోర్డు సభ్యులు మురంశెట్టి రాములు, చిటుమల్ల శ్రీనివాస్‌, నాయకులు వెంకట్‌, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


ముర్రంశెట్టి రాములు సేవలు అభినందనీయం

హుస్నాబాద్‌రూరల్‌, జూన్‌ 7: ఇరవై సంవత్సరాలుగా నిత్య అన్నదానం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు ముర్రంశెట్టి రాములు అభినందనీయుడని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం హుస్నాబాద్‌ మండలం పందిల్ల గ్రామంలో స్వయంభూ రాజేశ్వర ట్రస్టు, వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముర్రంశెట్టి రాములు తన తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు, ట్రస్టు శాశ్వత నిధికి తన వంతుగా నెల వేతనాన్ని ట్రస్టుకు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి హరీశ్‌రావుకు ముర్రంశెట్టి రాములు రుద్రాక్షమాల, తిరుపతి లడ్డూను అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ లకావత్‌ మానస, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, సర్పంచ్‌ తొడేటి రమేష్‌, ఎంపీటీసీ జయలక్ష్మి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T04:58:23+05:30 IST