మది నిండుగా

ABN , First Publish Date - 2022-12-31T00:37:35+05:30 IST

ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలను మిగుల్చుతూ 2022వ సంవత్సరం వీడ్కోలు పలుకుతోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించి అభివృద్ధి పరంగా ఈ ఏడాది కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. సాగునీటి రంగంతోపాటు విద్య, వైద్య, పర్యాటక, ఆధ్యాత్మిక అంశాల్లో వినూతనమైన ఫలితాలు సాక్షాత్కరించాయి. ప్రముఖ వ్యక్తులు జిల్లాలో పర్యటించారు. ప్రజావారధిగా సమస్యల పరిష్కారంలో ‘ఆంఽధ్రజ్యోతి’ వెన్నంటే నిలిచింది.

మది నిండుగా
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌(ఫైల్‌)

ఎన్నెన్నో జ్ఞాపకాలు మిగిల్చిన 2022

మల్లన్నసాగర్‌ ప్రారంభం.. గౌరవెల్లి ట్రయల్‌రన్‌

సీఎం, గవర్నర్‌, ఇతర కీలక నేతల పర్యటనలు

కొమురవెల్లి మల్లన్నకు చిరస్మరణీయం

వైద్యశాఖలో వినూత్నమైన సంస్కరణలు

టెన్త్‌లో నంబర్‌వన్‌.. ఆయిల్‌పామ్‌లో టాప్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు30 : ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలను మిగుల్చుతూ 2022వ సంవత్సరం వీడ్కోలు పలుకుతోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించి అభివృద్ధి పరంగా ఈ ఏడాది కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. సాగునీటి రంగంతోపాటు విద్య, వైద్య, పర్యాటక, ఆధ్యాత్మిక అంశాల్లో వినూతనమైన ఫలితాలు సాక్షాత్కరించాయి. ప్రముఖ వ్యక్తులు జిల్లాలో పర్యటించారు. ప్రజావారధిగా సమస్యల పరిష్కారంలో ‘ఆంఽధ్రజ్యోతి’ వెన్నంటే నిలిచింది.

సాగునీటిలో సగర్వంగా

ఫిబ్రవరి 23వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ప్రారంభించారు. ఏడాదిలోగా మల్లన్నసాగర్‌ సమీప ప్రాంతాన్ని అద్బుతంగా తీర్చిదిద్దుతామని నాడు ప్రకటించారు. నిర్వాసితుల ఉద్యమాలతో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ఒకప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. చివరకు గమ్యం చేరింది.

మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని సస్యశామలం చేసే గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు తుదిదశకు చేరాయి. ఆగస్టు 5వ తేదీన ట్రయల్‌రన్‌ నిర్వహించి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోశారు. మరో రెండు నెలల్లో ఈ రిజర్వాయర్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు. కాగా నిర్వాసితులు తమ పరిహారం కోసం ఆందోళనలు చేపట్టగా పోలీసుల జోక్యంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. లాఠీచార్జీలతో నిర్వాసితులు గాయపడగా, పోలీసులకు సైతం గాయాలయ్యాయి.

మురిసిన కొమురెల్లి మల్లన్న

2022వ సంవత్సరం కొమురవెల్లి మల్లన్న ఆలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎన్నడూ లేని విధంగా మల్లన్నస్వామికి ప్రాధాన్యం దక్కింది. ఫిబ్రవరి 23వ తేదీన సీఎం కేసీఆర్‌ మల్లన్నసాగర్‌ జలాలలను స్వయంగా ఆలయానికి తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను అభిషేకించారు. గత నవంబరు10వ తేదీన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. డిసెంబరు 18వ తేదీన మల్లన్న కల్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్‌రావు కిలోన్నర బరువున్న బంగారు కిరీటాన్ని అందజేశారు. అదేవిధంగా ఈ ఏడాది రాజీవ్‌ రహదారి నుంచి ఆలయం వరకు డబుల్‌ రోడ్డు మంజూరై పనులు సాగుతున్నాయి.

బైరాన్‌పల్లికి గవర్నర్‌

నవంబర్‌ 10వ తేదీన రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై మద్దూరు మండలం బైరాన్‌పల్లిలోని తెలంగాణ సాయుధ పోరాట అమరుల స్థూపాన్ని సందర్శించారు. గ్రామంలోని అమరవీరుల కుటుంబ సభ్యులను అప్యాయంగా పలకరించారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ములుగు మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి డిసెంబరు 23వ తేదీన గవర్నర్‌ తమిళిసై ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పట్టా సర్టిఫికెట్లు అందజేశారు.

కేఏ పాల్‌కు చెంపదెబ్బ

మే 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో ఓ టీఆర్‌ఎస్‌ నేత కేఏ పాల్‌ను చెంపదెబ్బ కొట్టడం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.

బీజేపీ అఽధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టి ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలోని బెజ్జంకి, కోహెడ మండలాల్లో కొనసాగింది. హుస్నాబాద్‌ పట్టణంలో ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించారు. బీజేపీ ప్రజా భరోసా యాత్రలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పాల్గొన్నారు.

‘పది’లో నంబర్‌వన్‌

పదో తరగతి పరీక్షల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు రికార్డు సృష్టించారు. 97.85 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకున్నారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుండి ఇదే రికార్డు. ఈ ఏడాది బాసర ట్రిపుల్‌ ఐటీకి జిల్లా నుంచి 281 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇక ఇంటర్‌లో 68 శాతం ఉత్తీర్ణతతో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది.

వ్యవసాయంలో కొత్తపుంతలు

  • రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పామాయిల్‌ తోటల సాగులో సిద్దిపేట జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్‌ 14వ తేదీన నంగునూరు మండలం నర్మెటలో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు.

  • జిల్లాలో గడిచిన వానాకాలంలో 85,467 మంది రైతుల నుండి 3.58లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

  • తొలిసారిగా అధిక సాంద్రత పత్తిని 17 మండలాల్లో సాగు చేశారు. 622 మంది రైతులు 1040 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు.

  • మల్బరీ సాగులోనూ రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు పైగానే సాగు చేస్తున్నారు.

వైద్యరంగం అభివృద్ధిలో దూసుకెళ్తూ

జిల్లాకు చెందిన హరీశ్‌రావు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉండడంతో ఎనలేని లబ్ధి చేకూరింది.

  • సిద్దిపేట పట్టణంలో బిఎస్సీ నర్సింగ్‌ కళాశాలను ప్రారంభించడమే గాకుండా రూ.40కోట్ల విలువైన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

  • రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 55 మందికి మోకాలి శస్త్ర చికిత్సలను రూపాయి ఖర్చులేకుండా విజయవంతంగా చేశారు.

  • మిషన్‌ ఇంద్రధను్‌షలో భాగంగా చిన్నారులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన క్రమంలో జిల్లాకు ప్రైమ్‌ మినిష్టర్‌ అవార్డు దక్కింది.

  • సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి పరిధిలో ఉచిత రేడియాలజీ సెంటర్‌ను, పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

  • ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు రికార్డుస్థాయిలో 57పీజీ సీట్లు మంజూరయ్యాయి.

  • సెప్టెంబరు నెలలో చిన్నకోడూరు మండలంలోని రామంచ గ్రామ శివారులో రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు.

  • ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా 50సీట్లతో పారామెడికల్‌ కోర్సులు మంజూరయ్యాయి.

  • హుస్నాబాద్‌లో 50 పడకల ఆస్పత్రి, డయాలసిస్‌ సెంటర్లను ప్రారంభించారు.

కదిలించిన ‘ఆంధ్రజ్యోతి’

  • ఏడునెలలైనా సిద్దిపేట జిల్లాకు రెగ్యులర్‌ కలెక్టర్‌ లేరనే అంశంపై జూన్‌ 10వ తేదీన ఆంధ్రజ్యోతిలో ’బాస్‌ లేడు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్‌ మరుసటి రోజే ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను నూతన కలెక్టర్‌గా నియమించారు.

  • జూలై 15వ తేదీన తొగుట తహసీల్దార్‌ క్రిష్ణమోహన్‌ కార్యాలయంలోనే బహిరంగంగా లంచాలు తీసుకున్న ఘటనపై ‘ఖుషీగా ఇచ్చిపోవాలె’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఎక్స్‌క్లూజివ్‌ వార్తకు తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేశారు. జిల్లాలోని తహసీల్దార్‌ల పనితీరును పలుమార్లు ఎండగట్టడం జరిగింది.

  • జిల్లాలో అడ్డగోలుగా ఇసుక తోడుతున్న విషయంపై అక్టోబరు 14వ తేదీన ‘ఇసుక తోడేళ్లు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కాగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు.

  • జిల్లాలో పోలీసులు ఎడాపెడా జరిమానాలు విధించి సామాన్యులపై ఆర్థిక భారం మోపుతున్న విషయంపై నవంబరు 22వ తేదీన కథనం ప్రచురితం కాగా మంత్రి హరీశ్‌రావు స్పందించి జరిమానాలు నిలిపివేయాలని ఆదేశించారు.

  • గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ వసూళ్లపై కథనం రావడంతో అతన్ని సస్పెండ్‌ చేశారు.

  • ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెల్లిలో కొలువైన అమ్మవార్లకు కేవలం పుస్తెలతాడుతోనే సరిపెడుతున్నారని, స్వామివారికి బంగారు కిరీటం చేయించనున్నారనే కథనానికి స్పందన వచ్చింది. వచ్చే ఏడాది కల్యాణం వరకు అమ్మవార్లకు సైతం బంగారు కిరీటాలు చేయిస్తానని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

ఫ హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లికి చెందిన బోనగిరి సన్నీ అనే నిరుపేద విద్యార్థికి ఎంబీబీఎ్‌సలో ఉచిత సీటు వచ్చినప్పటికీ కనీస అవసరాలకు డబ్బులు లేవనే విషయంపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంతో దాతలు స్పందించారు. ప్రస్తుతం సన్నీ ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు.

Updated Date - 2022-12-31T00:37:35+05:30 IST