మెతుకు సిరులు

ABN , First Publish Date - 2022-12-21T23:45:32+05:30 IST

మెతుకుసీమగా విలసిల్లిన ఉమ్మడి మెదక్‌ జిల్లా ఆ పేరును సార్ధకం చేసుకున్నది. మొత్తం 12 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. కాగా రైతులు ఆహార అవసరాలకు మరియు కొంతమంది స్థానిక రైస్‌మిల్లర్లకు అమ్ముకోగా మిగతా 9,33,107 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు.

మెతుకు సిరులు
సిద్దిపేటలోని ఓ రైస్‌మిల్లులో నిల్వచేస్తున్న ధాన్యం బస్తాలు

  • పూర్తయిన వానాకాలం సీజన్‌ ధాన్యం సేకరణ

  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి

  • రూ.1920 కోట్ల విలువైన 9.33 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు

  • రైతుల ఖాతాల్లో రూ.1873 కోట్లు జమ

  • రికార్డుస్థాయి పంట దిగుబడితో మురిసిన మెతుకు సీమ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 21 : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వానాకాలం సీజన్‌ ధాన్యం సేకరణ ముగిసింది. ప్రభుత్వం పీఏసీఎస్‌, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డుస్థాయిలో ధాన్యాన్ని సేకరించింది. మొత్తం 12 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా కాగా రైతులు ఆహార అవసరాలకు మరియు కొంతమంది స్థానిక రైస్‌మిల్లర్లకు అమ్ముకోగా మిగతా 9,33,107 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. 2 లక్షలపైచిలుకు రైతులు వడ్లను విక్రయించారు. మెతుకుసీమగా విలసిల్లిన ఉమ్మడి మెదక్‌ జిల్లా ఆ పేరును సార్ధకం చేసుకున్నది.

1,053 కొనుగోలు కేంద్రాలు

గడిచిన రెండు నెలలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1053 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించారు. ఏ గ్రేడ్‌ వరి రకం క్వింటాల్‌కు రూ.2060, బి గ్రేడ్‌ రకానికి రూ.2040 చొప్పున మద్దతు ధర నిర్ణయించారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతోపాటు అప్పుడప్పుడు చెదురుముదురు వర్షాలు కూడా పడడంతో కొనుగోళ్లు కొంత ఆలస్యంగా మొదలయ్యాయి. ఈసారి ముందస్తుగానే మూడు జిల్లాల కలెక్టర్లు, ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెట్‌ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షలు ఏర్పాటు చేశారు. ఫలితంగా ధాన్యం తరలింపు, ఆన్‌లైన్‌, రైతుల ఖాతాల్లో డబ్బు జమ విషయంలో ఆలస్యం కాలేదు. ట్యాబ్‌ ఎంట్రీలోనూ ఉమ్మడి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

రైతుల ఖాతాల్లో రూ.1873 కోట్లు జమ

ఉమ్మడి జిల్లాకు చెందిన 2,08,736 మంది రైతులు వరి పంటను సాగు చేయగా సిరుల పంట పండింది. సుమారు 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. రికార్డు స్థాయిలో 9,33,017 మెట్రిక్‌ టన్నుల వడ్లను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. దీనికి గాను రైతులకు రూ.1920 కోట్ల నగదును చెల్లించాల్సి ఉండగా సుమారు రూ.1873 కోట్లను వారి ఖాతాల్లో ఇప్పటికే జమ చేశారు. ఇటీవల సేకరించిన ధాన్యానికి సంబంధించిన రూ.47 కోట్లను చెల్లించాల్సి ఉందని పౌరసరఫరాల శాఖ రికార్డుల్లో నమోదు చేశారు. అంతేగాకుండా రెండు నెలలు నిరాటంకంగా కొనసాగిన కేంద్రాలను మూసివేశారు.

యాసంగికి సమాయత్తం

వానాకాలం సీజన్‌ పూర్తి కావడంతో ప్రస్తుతం యాసంగిపై రైతులంతా దృష్టి పెట్టారు. బావులు, బోర్లు సౌకర్యంతోపాటు ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులు నాట్లను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లతో గతేడాది యాసంగిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగునీటిని తరలించారు. ఈసారి రిజర్వాయర్లలో యాసంగికి సరిపడా తగిన నీటి సామర్థ్యం ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గతేడాది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 2.55 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం సాగు చేయగా ప్రస్తుత యాసంగిలో 3 లక్షల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా వేశారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో ఉన్న గోదావరి జలాలను హల్దీవాగుతోపాటు కాలువల ద్వారా మంజీరా నదిలోకి తరలించిన విషయం తెలిసిందే. దీంతో రైతుల్లో యాసంగిపై ఆశలు చిగురించాయి.

ధాన్యం కొనుగోలు వివరాలు

సంగారెడ్డి సిద్దిపేట మెదక్‌

కొనుగోలు కేంద్రాలు 227 416 410

ధాన్యం(టన్నులు) 1,87,516 3,43,391 4,02,110

రైతుల సంఖ్య 36,213 81,154 91,379

చెల్లించాల్సిన నగదు 386 కోట్లు 706 కోట్లు 828 కోట్లు

చెల్లించిన నగదు 386 కోట్లు 687 కోట్లు 800 కోట్లు

Updated Date - 2022-12-21T23:45:33+05:30 IST