రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-12-16T23:59:08+05:30 IST
రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు.
మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్
కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం
మెదక్ అర్బన్, డిసెంబరు16: రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌హాల్‌లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరగడానికి ప్రధానంగా అధికంగా మలుపులు ఉండడం, ప్రమాద హెచ్చరికలు, స్పీడ్ నియంత్రణ సూచికలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో పాటు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవర్ తప్పిదాలు, హెల్మెట్ ధరించకపోవడం కూడా కారణమన్నారు. మనోహరాబాద్ నుంచి తూప్రాన్, చేగుంట, రామాయంపేట జాతీయ రహదారితో పాటు నర్సాపూర్ - మెదక్ రహదారి వెంట గుర్తించిన బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పెద్దశంకరంపేట అంకోలా జాతీయ రహదారి పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అల్లాదుర్గం, బోడమటపల్లి సర్వీస్ రోడ్డును అనుసంధానం చేయాలన్నారు. జమ్మికుంట వద్ద ఇరుకుగా ఉన్న వంతెన వద్ద లైటింగ్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రోడ్లపై పశువులు తిరగకుండా చూడాలన్నారు. రోడ్డు పక్కన ఉన్న గ్రిల్స్ తొలగించకుండా అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా వీటిని అతిక్రమిస్తే జరిమానాతో పాటు శిక్ష పడుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నర్సాపూర్ నుంచి కొల్చారం మధ్య క్షతగాత్రులకు తక్షణ వైద్యం సహాయం అందేలా అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, రహదారుల వెంట బయోవాష్ రూంలను ఏర్పాటు చేయాలని చెప్పారు. మసకగా ఉన్న ప్రాంతాల్లో రోడ్లపై హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. నర్సాపూర్-మెదక్ రహదారిలో అవసరమైన ప్రాంతాల్లో రంబుల్ స్ర్టిప్స్ వేయాలని, పట్టణంలోని వెల్కమ్‌బోర్డు దగ్గర రహదారిని సరిచేస్తూ.. సర్కిల్ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. సమావేశంలో డీటీవో శ్రీనివాస్‌గౌడ్, ఆర్‌అండ్‌బీ డీఈఈ వెంకటేశం, జాతీయ ప్రాధికార సంస్థ మేనుజర్ తరుణ్‌కుమార్, హైవే సీనియర్ ఇంజనీర్ ఏడుకొండలు, కిరణ్, ఎక్సైజ్ ఈఎస్ రజాక్, పట్టణ సీఐ మధు పాల్గొన్నారు.