ప్రాణదాతలు

ABN , First Publish Date - 2022-08-18T04:50:32+05:30 IST

ఎప్పుడో, ఎక్కడో ఒకరు చేసిన రక్తదానం ప్రాణాన్ని కాపాడుతుందని, కష్ట సమయంలో రక్తదానం చేసిన వ్యక్తి దేవుడిగా మారుతాడని రాష్ట్ర ఆర్థిక, వెద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాణపాయస్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ప్రాణదాతలు
క్యాంపు కార్యాలయంలో రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు


కష్టకాలంలో రక్తదాతలు దేవుడితో సమానం

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 10 వేల యూనిట్ల రక్తం సేకరణ

సీఎం కేసీఆర్‌ పిలుపుతో అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు

స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ రక్తదానం అద్భుతమైన కార్యక్రమం

రాష్ట్ర ఆర్థిక, వెద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 17 : ఎప్పుడో, ఎక్కడో ఒకరు చేసిన రక్తదానం ప్రాణాన్ని కాపాడుతుందని, కష్ట సమయంలో రక్తదానం చేసిన వ్యక్తి దేవుడిగా మారుతాడని రాష్ట్ర ఆర్థిక, వెద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాణపాయస్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 75 యూనిట్లు సేకరణ చేస్తున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 10 వేల యూనిట్ల రక్త సేకరణ ఈ ఒక్కరోజే జరుగుతున్నదన్నారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్‌బ్లడ్‌ అంటారని, ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్‌, తెల్లరక్తకణాలు, ఎర్ర రక్తకణాలు కలసిన ద్రవం వంటివన్నీ ఉంటాయని చెప్పారు. ఈ రక్తాన్ని కంపోనెంట్‌గా వేరు చేసి అవసరమైన వారికి అందిస్తామని, అప్పుడు ఒకరి రక్తం ముగ్గురి ప్రాణాలు కాపాడుతుందని వివరించారు. టీచింగ్‌ ఆసుపత్రుల నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో, వైద్య సిబ్బంది రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నారని, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేస్తున్నారని మంత్రి తెలిపారు. వజ్రోత్సవాల వేళ రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం గొప్పగా ఉందని, మనమంతా ఒక్కటేనని, భారతీయులమని, కుల, మత, జాతి బేధాలు లేవని ఈ కార్యక్రమం ద్వారా చాటుతున్నామన్నారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాలతో నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుతున్నామని, వారి త్యాగాలను మనం గుర్తుంచుకొని దేశభక్తిని చాటాలన్నారు. అన్నదానం చేస్తే, ఓ పూట ఆకలి తీర్చొచ్చని... విద్యాదానం చేస్తే జ్ఞానం పంచొచ్చని, అదే రక్తదానం చేస్తే ప్రాణదాతలు కావొచ్చన్నారు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారని చెప్పారు. మానవతా హృదయంతో ఎంతో మంది స్పందించి రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తుంటారని, ఇంటి పనులు, ఆఫీసు పనులు, వ్యక్తిగత పనులు పక్కన పెట్టి, దూర ప్రాంతాల నుంచి వచ్చి రక్తదానం చేస్తుంటారని, అలాంటి వారు ఎంతో గొప్ప మనసున్నవారని తెలిపారు. ఇలా రక్త దానం చేస్తూ ప్రాణ దాతలుగా ఉన్నవారు ఎందరో మన చుట్టూ ఉన్నారని, ప్రతి ఒక్కరికీ నా వందనాలు తెలిపారు. మీరు అందించిన రక్తం ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ఎన్నో కుటుంబాలను నిలబెట్టుతుందని తెలిపారు. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలని సూచించారు. రక్తదానంపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని, ఆరోగ్య వంతులు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈరోజు మాత్రమే కాదు, మీ పుట్టిన రోజులు, కుటుంబ సభ్యుల పుట్టిన రోజున, పెళ్లిరోజున రక్తదానం చేయాలని మంత్రి కోరారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి, వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ కాశీనాథ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు మేర సత్తన్న తదితరులు పాల్గొన్నారు.


రక్తదానం చేసి ప్రాణాలను నిలపండి

గజ్వేల్‌, ఆగస్టు 17: రక్తదానం చేసి ప్రాణాలను నిలపాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్బంగా గజ్వేల్‌ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బుధవారం ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్నదానం చేస్తే ఒకపూట వరకే ఉంటుందని, విద్యాదానం చూస్తే జ్ఞానం పెంచవచ్చని, అదే రక్తదానం చేస్తే ప్రాణదాతలుగా ఉండవచ్చని, అందుకే అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సాయికుమార్‌, కౌన్సిలర్లు, నాయకులున్నారు. 


Updated Date - 2022-08-18T04:50:32+05:30 IST