కుష్ఠుపై సమరం

ABN , First Publish Date - 2022-12-07T00:27:27+05:30 IST

కుష్ఠు వ్యాధి ప్రాణాంతకమైనది కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యాన్ని కల్పించగల మహమ్మారి. వ్యాధి తీవ్రత ఇటీవల పెరుగుతున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన జాతీయ ఆర్యోగ మిషన్‌ కుష్ఠు వ్యాధిగ్రస్థులు, లక్షణాలు కలిగినవారిని గుర్తించాలని నిర్ణయించింది.

కుష్ఠుపై సమరం

ప్రారంభమైన ఇంటింటా లెప్రసీ సర్వే

తొలి రోజు సర్వేలో 53 మందికి వ్యాధి లక్షణాల గుర్తింపు

ఈ నెల 22 వరకు కార్యక్రమం

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 6: కుష్ఠు వ్యాధి ప్రాణాంతకమైనది కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యాన్ని కల్పించగల మహమ్మారి. వ్యాధి తీవ్రత ఇటీవల పెరుగుతున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన జాతీయ ఆర్యోగ మిషన్‌ కుష్ఠు వ్యాధిగ్రస్థులు, లక్షణాలు కలిగినవారిని గుర్తించాలని నిర్ణయించింది. అందులో భాగంగా 14 రోజుల పాటు ఇంటింటా లెప్రసీ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 22 వరకు కార్యక్రమం కొనసాగనుంది.

బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి

కుష్ఠు వ్యాధి అనేది మైకో బ్యాక్టీరియా లెప్రె, మైకో బ్యాక్టీరియా లెప్రమటోసిస్‌ అనే బ్యాక్టీరియాల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది అంటువ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస ద్వారా బ్యాక్టీరియా గాలిలో కలిసి ఇతరుల శరీరంలో చేరుతుంది. శరీరంలో చేరిన ఏడు రోజుల వరకు బ్యాక్టీరియా బతికి ఉంటుంది. రోగనిరోధ శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతోంది. వ్యక్తి రోగనిరోధక శక్తిని బట్టి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల సమయం తీసుకుటుంది. శరీరంపై తెల్లటి, రాగి రంగు మచ్చలు రావడం, ఆ ప్రదేశంలో స్పర్శ తెలియకపోవడం, కాలి, చేతి వేళ్లు తిమ్మిర్లుగా ఉండటం వ్యాధి లక్షణాలు. ఇంటింటా సర్వేలో కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి సమీప పీహెచ్‌సీలో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి సోకినట్లు తేలితే వెంటనే చికిత్స అందించేలా చర్యలు ప్రారంభిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 17 మంది కుష్ఠు వ్యాధిగ్రస్థులను గుర్తించి చికిత్సను అందిస్తున్నారు.

తొలిరోజు 14,992 గృహాలు..

మంగళవారం ఇంటింటా లెప్రసీ సర్వే ప్రారంభమైంది. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 566 మంది ఆశ కార్యకర్తలు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు 25 ఇండ్లకు వెళ్లి పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా 14, 992 గృహాలను సందర్శించారు. 53 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు.

సకాలంలో గుర్తిస్తే చికిత్స సులువే : చందునాయక్‌, మెదక్‌ జిల్లా వైద్యాధికారి

కుష్ఠువ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే సులువుగా తగ్గించవచ్చు. ఈ వ్యాధిపై అపోహలు వీడి చికిత్స చేయించుకోవాలి. జిల్లాలో ఎంతమందికి లక్షణాలు ఉన్నాయనే సమాచారాన్ని సేకరించి, వారికి చికిత్స అందించాలనే లక్ష్యంతో లెప్రసీ సర్వే చేపడుతున్నాం.

Updated Date - 2022-12-07T00:27:29+05:30 IST