రెడ్డిఖానాపూర్‌లో భూవివాదం

ABN , First Publish Date - 2022-12-16T00:16:00+05:30 IST

భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

రెడ్డిఖానాపూర్‌లో భూవివాదం
పోచయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

హత్నూర, డిసెంబరు 15: భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన హత్నూర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెడ్డిఖానాపూర్‌ గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. రెడ్డిఖానాపూర్‌ గ్రామానికి చెందిన నీరుడి పోచయ్య (52), అతడి తమ్ముడు నీరుడి శ్రీనివాస్‌ గతంలో పెద్దల సమక్షంలోనే భూమి పంపకాలు చేసుకున్నారు. అయితే తమ్ముడు శ్రీనివాస్‌ తనవంతు భూమి బోరును అన్న నీరుడి పోచయ్యకు కౌలుకు ఇచ్చాడు. కౌలు సమయం ముగియడంతో ఇటీవల తన భూమి తాను సాగు చేసుకుంటానని తెలిపాడు. యాసంగి పంట వేసుకుంటేనే తన పెట్టుబడి తీరుతుందని తమ్ముడికి పోచయ్య చెప్పాడు. గురువారం మధ్యాహ్నం పొలం వద్ద కలిసిన అన్నదమ్ముల మధ్య కౌలు విషయమై మాటలు పెరిగాయి. దీంతో ఆవేశానికి గురైన శ్రీనివాస్‌ అన్న పోచయ్య తలపై కర్రతో దాడి చేయడంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. హత్నూర ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, జిన్నారం సీఐ వేణుకుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-12-16T00:16:22+05:30 IST