కాంగ్రెస్‌ను వెంటాడుతున్న నాయకత్వ లేమి

ABN , First Publish Date - 2022-08-18T05:13:09+05:30 IST

ఒకప్పుడు నర్సాపూర్‌ నియోజకవర్గం కాంగ్రె్‌సకు కంచుకోటగా ఉండేది.

కాంగ్రెస్‌ను వెంటాడుతున్న నాయకత్వ లేమి



నర్సాపూర్‌ నియోజకవర్గం పార్టీ నాయకుల్లో గందరగోళం

నర్సాపూర్‌, ఆగస్టు 17 : ఒకప్పుడు నర్సాపూర్‌ నియోజకవర్గం కాంగ్రె్‌సకు కంచుకోటగా ఉండేది. మాజీ మంత్రి సునీతారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడిన తర్వాత నియోజకవర్గస్థాయిలో చక్రం తిప్పగల నాయకుడు ఎవరూ లేకపోవడంతో పాటు పార్టీకి ఇక్కడ ఇన్‌చార్జి లేక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొన్నది. ఎన్నికలు సమీపిస్తున్నా, ఎవరికీ నియోజకవర్గస్థాయి బాధ్యతలు అప్పగించకుండా అధిష్ఠానం కాలయాపన చేస్తుండటంతో పార్టీ నాయకుల్లో గందరగోళానికి దారితీస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర నాయకులుగా చెలామణి అవుతున్న ఆవులరాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్‌, రవీందర్‌రెడ్డిలు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా ముగ్గురి మధ్య సమన్వయం కొరవడిందన్న విమర్శలున్నాయి. ఎవరికి వారే తమకే టికెట్‌ వస్తుందన్న ప్రచారం చేసుకుంటూ క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తుండటంతో కార్యకర్తలకు ఎవరివెనుక ఉండాలో  తెలియని పరిస్థితి నెలకొన్నది. కాంగ్రె్‌సకు నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో బలమైన కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు ఇప్పటికీ ఉన్నారు. వారిని ఒక్క తాటిపై తెచ్చి  అందరిని కలుపుకుని పార్టీని నడిపించగల సత్తా ఉన్న వారిని గుర్తించి, ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పుంజుకుంటుందన్న భావన ఆ పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్నది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకం విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయంపై కాంగ్రెస్‌ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.   

Updated Date - 2022-08-18T05:13:09+05:30 IST