కబ్జా కోరల్లో కుమ్మరికుంట

ABN , First Publish Date - 2022-09-05T05:54:58+05:30 IST

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో కుమ్మరికుంట కబ్జాలతో కుచించుకు పోతున్నది. సర్వే నంబర్‌ 343లో కొండలు, గుట్టల మధ్య సుమారు పదెకరాల్లో విస్తరించిన కుంట కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాత్రికి రాత్రి కుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో, శిఖం భూమిలో మట్టిని పోసి చదును చేస్తున్నారు. అమీన్‌పూర్‌ పెద్దచెరువుకు అనుబంధంగా ఉన్న కుమ్మరికుంట నుంచి దిగువున ఉన్న చెరువులకు గొలుసుకట్టు కాలువల ద్వారా నీరు వెళ్తుంది. కుంటకు ఒకవైపు టీఎస్‌ ఎస్‌పీఎఫ్‌ పోలీస్‌ అకాడమీ ఉండగా మరోవైపు ప్రైవేటు వ్యక్తులు భారీ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

కబ్జా కోరల్లో కుమ్మరికుంట

ఎఫ్‌టీఎల్‌, శిఖం భూమి అన్యాక్రాంతం

చెరువు పరిధిలో మట్టిని నింపి చదును చేస్తున్న అక్రమార్కులు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

‘జీవ వైవిధ్యా’నికి ప్రమాదం


పటాన్‌చెరు, సెప్టెంబరు 4: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో కుమ్మరికుంట కబ్జాలతో కుచించుకు పోతున్నది. సర్వే నంబర్‌ 343లో కొండలు, గుట్టల మధ్య సుమారు పదెకరాల్లో విస్తరించిన కుంట కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాత్రికి రాత్రి కుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో, శిఖం భూమిలో మట్టిని పోసి చదును చేస్తున్నారు. అమీన్‌పూర్‌ పెద్దచెరువుకు అనుబంధంగా ఉన్న కుమ్మరికుంట నుంచి దిగువున ఉన్న చెరువులకు గొలుసుకట్టు కాలువల ద్వారా నీరు వెళ్తుంది. కుంటకు ఒకవైపు టీఎస్‌ ఎస్‌పీఎఫ్‌ పోలీస్‌ అకాడమీ ఉండగా మరోవైపు ప్రైవేటు వ్యక్తులు భారీ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏదైనా జలాశయం ఎగువన భవణాల నిర్మాణానికి అనుమతులు జారీచేసే క్రమంలో ఇరిగేషన్‌ శాఖ హద్దులు నిర్ణయించి శిఖం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లను నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి హద్దులు ఏర్పాటు చేయకుండానే నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఎఫ్‌టీఎల్‌తో పాటు చెరువు శిఖం భూమిని చెరబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


కట్ట, తూమునూ వదలని అక్రమార్కులు

ఓవైపు కుమ్మరి కుంట శిఖం, ఎఫ్‌టీఎల్‌ను కబ్జా చేస్తుండగానే మరోవైపు కుంటలోని నీరు దిగవుకు వదిలే తూము సైతం కబ్జాకు గురైంది. కుమ్మరికుంట నుంచి బందంకొమ్ము చెరువులోకి నీరు వచ్చే దారిని పూర్తిగా మూసివేశారు. తూము నుంచి వచ్చే కాలువ పూర్తిగా కనుమరుగైంది. కుంట కట్టను సైతం చదును చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కుమ్మరికుంట కబ్జాలపై అనేకమార్లు అధికారులకు ఫిర్యాదులు అందినా స్పందన కరువైంది. జీవవైవిధ్య పెద్దచెరువుకు అనుబంధంగా ఉన్న గొలుసుకట్టు చెరువులు, కుంటలను సైతం పరిరక్షించాలని గతంలో అనేకమార్లు చెన్నై హరిత ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచనలు అమలుకావడం లేదు. చుట్టుపక్కల కుంటలు మాయంకావడంతో జీవవైవిధ్యం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం నెలకొంది. కొండలు, గుట్టల మధ్య ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా ఉండే కుమ్మరికుంట కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కుమ్మరులు పాత్రలను తయారు చేసేందుకు ఈ కుంట నుంచే మట్టిని సేకరిస్తారు. మట్టి పాత్రలు తయారు చేసేందుకు కావాల్సిన ప్రత్యేక మెత్తటి మట్టి ఈ కుంటలోనే లభ్యమవుతుంది. అందుకే కుంటను రక్షించాలని స్థానిక శాలివాహన సంఘం అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలదని వారు విమర్శిస్తున్నారు. కుమ్మరి కుట కబ్జా వ్యవహారంపై ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులను వివరణ కోరగా పరిశీలిస్తామని, హద్దులు నిర్ణయిస్తామని మొక్కుబడిగా సమాధానం చెప్పడం గమనార్హం.

Updated Date - 2022-09-05T05:54:58+05:30 IST