భక్తుల కొంగుబంగారం కొండపోచమ్మ
ABN , First Publish Date - 2022-01-17T05:07:56+05:30 IST
జగదేవపూర్ మండలం తిగుల్ నర్సాపూర్ శివారులో ప్రకృతి ఒడిలో వెలసిన కొండపోచమ్మ ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. కొండపోచమ్మ నామంతో ప్రసిద్ధి పొందిన జగన్మాత శీలాదేవి వేలాదిమంది భక్తులకు ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నారు. కొమురవెల్లి మల్లన్న దర్శనం అనంతరం భక్తులు కొండపోచమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలలపాటు ఇక్కడ జాతర కొనసాగుతుంది. జాతరకు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.

మూడు నెలల జాతరకు ముస్తాబు
నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
జగదేవపూర్, జనవరి 16: జగదేవపూర్ మండలం తిగుల్ నర్సాపూర్ శివారులో ప్రకృతి ఒడిలో వెలసిన కొండపోచమ్మ ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. కొండపోచమ్మ నామంతో ప్రసిద్ధి పొందిన జగన్మాత శీలాదేవి వేలాదిమంది భక్తులకు ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నారు. కొమురవెల్లి మల్లన్న దర్శనం అనంతరం భక్తులు కొండపోచమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలలపాటు ఇక్కడ జాతర కొనసాగుతుంది. జాతరకు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.
మల్లన్న సోదరి పోచమ్మ
హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిపై కొడకండ్ల గ్రామం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. కొమురవెల్లి మల్లికార్జున స్వామికి కొండపోచమ్మ స్వయానా చెల్లెలని భక్తులు నమ్ముతారు. మొదట్లో అమ్మవారు కొమురవెల్లిలోనే ఉండేవారని, మల్లన్న స్వామి కోప్పడటంతో అలిగి ఇక్కడ దట్టమైన అడవుల్లో స్థిరపడ్డారని ప్రతీతి. మల్లన్న తన సోదరి జాడ తెలుసుకొని ఇంటికి రమ్మని కోరగా ఆమె ఇక్కడే ఉంటానని తేల్చిచెప్పారని, అప్పుడు మల్లన్న కొమురవెల్లికి వచ్చిన భక్తులంతా పోచమ్మను కూడా దర్శించుకునేలా వరం ఇచ్చారని చెప్పుకుంటారు. అందుకే కొమురవెల్లి జాతరకు వచ్చే భక్తులు కొండపోచమ్మను తప్పనిసరిగా దర్శించుకుంటారు.
ఆకట్టుకునే పట్నం బోనాలు
పట్నం వారం అనంతరం సోమవారం భక్తులు కొండపోచమ్మను దర్శించుకుని పట్నం బోనాలు సమర్పిస్తారు. భక్తులు ఆలయం ఎదుట ఉన్న చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం వండి ఊరేగింపుగా తరలివచ్చి బోనాలను అమ్మవారి సమర్పిస్తారు. కోరికలు తీర్చాలని అమ్మవారి గుడి వద్ద చెట్టుకు ముడుపులు కడతారు. కోరిక తీరిన అనంతరం అమ్మవారికి ముడుపులు చెల్లిస్తారు. సంతానం కోసం తొట్టెల కడతారు.
జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు
నేటి నుంచి జరగనున్న కొండపోచమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి తెలియజేశారు. ఆలయం వద్ద క్యూలైన్లు, పోలీసులతో కలిసి ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కోసం గజ్వేల్–ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, జనగామ, పికెట్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ అధికారులను సంప్రదించామని ఈవో మోహన్‌రెడ్డి వెల్లడించారు. జాతరకు రెండు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నామని, ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య పనుల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించామని సర్పంచ్ రజితరమేశ్ స్పష్టం చేశారు.