పొలానికి విద్యుత్‌ తీగలు అమర్చి హత్య

ABN , First Publish Date - 2022-10-08T05:06:16+05:30 IST

వ్యవసాయ పంట పొలంలో విద్యుత్‌వైర్లు అమర్చి ఒకరిని హత్య చేసిన సంఘటన మండలంలోని జూకల్‌ శివారులో చోటు చేసుకున్నది.

పొలానికి విద్యుత్‌ తీగలు అమర్చి హత్య
విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన సాయిలు

పెద్దశంకరంపేట, అక్టోబరు 7: వ్యవసాయ పంట పొలంలో విద్యుత్‌వైర్లు అమర్చి ఒకరిని హత్య చేసిన సంఘటన  మండలంలోని జూకల్‌ శివారులో చోటు చేసుకున్నది. శుక్రవారం పెద్దశంకరంపేట పోలీ్‌సస్టేషన్‌లో మెదక్‌ డీఎస్పీ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలంలోని చీకోడ్‌ గ్రామానికి చెందిన మంగలి సాయిలు(40)కు, అదే గ్రామానికి చెందిన వరుసకు అల్లుడైన మంగలి శ్రీరాంతో భూ తగాదాలున్నాయి.  పొలం ఒడ్డు విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకున్న శ్రీరాం మామను కడతేర్చేందుకు పథకం పన్నాడు. ఈ క్రమంలో సాయిలు పొలంలో గట్టుమీద విద్యుత్‌ తీగను అమర్చి షాక్‌ తగిలేలా ఏర్పాటు చేశాడు. గురువారం బోరు వేయడానికి సాయిలు వెళ్లగా.. శ్రీరాం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ కాలికి తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మొదటగా విద్యుత్‌షాక్‌తోనే సాయిలు మృతి చెందినట్లు శ్రీరాం అందరినీ నమ్మించాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. మృతుడి భార్య మంగలి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో అల్లాదుర్గం సీఐ జార్జ్‌, రేగోడు ఎస్‌ఐ సత్యనారాయణ ఉన్నారు.  

Read more