సంగారెడ్డిలో ప్రజావాణికి జనజాతర
ABN , First Publish Date - 2022-10-18T05:01:34+05:30 IST
సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ సందడిగా మారింది.
సమస్యలను పరిష్కరించాలని వినతులు
సంగారెడ్డి రూరల్, అక్టోబరు 17: సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ సందడిగా మారింది. మండలంలో అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా, వీరారెడ్డికి బాధితులు అర్జీలను అందజేశారు. చౌటకూర్ మండలం శివ్వంపేట, కొర్పోల్, అంగడిపేట, లింగంపల్లి, వెండికోల్ గ్రామాల రైతులకు చెందిన భూములను ఆర్‌ఆర్‌ఆర్‌లో కోల్పోతున్నారని వారికి న్యాయం చేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి వినతిపత్రం అందజేశారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కొడకంచి గ్రామస్థులు అర్జీ పెట్టుకున్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను, పింఛన్లను మంజూరు చేయాలని తెలంగాణ మాట్రిమేనియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీమ్ ఫిరోజ్ విన్నవించారు. కంది మండలం జుల్‌కల్‌లోని సర్వేనంబర్ 195లో ఒక ప్లాటు ఇప్పించాలని నాయీబ్రాహ్మణ సంఘం నాయకుడు దుర్గయ్య కోరాడు. సింగూర్ బ్యారేజీలో తమ ఇళ్లు, భూమి ముంపునకు గురైనా ఇప్పటి వరకు పునరావాసం కల్పించలేదని, ఇంటి నిర్మాణం కోసం స్థలం చూపించి పరిహారం ఇప్పించాలని పుల్కల్ మండలం సింగూర్ గ్రామానికి చెందిన గొంతెలి అంజేయులు అర్జీ సమర్పించారు. వచ్చిన అర్జీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ రాజర్షి షా, వీరారెడ్డి త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహించొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.