సంగారెడ్డి మున్సిపల్‌లో ప్రజా సమస్యలపై జగ్గారెడ్డి సమీక్ష

ABN , First Publish Date - 2022-03-06T05:10:38+05:30 IST

సంగారెడ్డి పట్టణాభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకా్‌షరెడ్డి(జగ్గారెడ్డి) చెప్పారు.

సంగారెడ్డి మున్సిపల్‌లో ప్రజా సమస్యలపై జగ్గారెడ్డి సమీక్ష
మున్సిపల్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

రూ.50కోట్లు మంజూరుపై సీఎంకు కృతజ్ఞతలు

మున్సిపల్‌ కౌన్సిల్‌తో పాటు ప్రజాభిప్రాయం మేరకే పనులు


సంగారెడ్డిటౌన్‌, మార్చి 5: సంగారెడ్డి పట్టణాభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకా్‌షరెడ్డి(జగ్గారెడ్డి) చెప్పారు. సంగారెడ్డిలోని మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, మురుగు కాల్వలు తదితర ప్రజాసమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపల్‌కు కేసీఆర్‌ పెద్దమనసు చేసుకుని రూ.50 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఈ నిధులు వచ్చేలా కృషి  చేసిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిధులను పార్టీలకతీతంగా కౌన్సిలర్ల కోర్కే మేరకు కేటాయించి అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. మంజీరా తాగునీటి సమస్యపై ఈనెల 15న రాజంపేటలోని ఫిల్టర్‌బెడ్‌ను సందర్శిస్తానని తెలిపారు. 2004లో తాను ఎమ్మెల్యేగా గెలువగానే సంగారెడ్డికి రూ.120 కోట్లతో ఇంటింటికీ మంజీరా నీటిని అందజేశామన్నారు. అంతకుముందు పట్టణంలో ప్రతి ఇంటి ముందు గుంతల్లోంచి నీటిని పట్టుకొనే వారని, తాను తీసుకున్న చర్యల వల్లే తాగునీటి సమస్య పరిష్కార మైందన్నారు. ఇంటెక్‌వెల్‌, ఫిల్టర్‌బెడ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు వినియోగించడం లేదని మున్సిపల్‌ అధికారులను ప్రశ్నించారు. మంజీరాలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ మిషన్‌భగీరథ నీటిని వినియోగిస్తూ మంజీరాను విస్మరించడం తగదన్నారు. మంజీరా నీటి శుద్ధిని సక్రమంగా చేయడం లేదని పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సీఎం మంజూరు చేసిన నిధులను కొత్త కాలనీలకు ప్రాధాన్యతనిచ్చి రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాలని అధికారులకు సూచించారు. రూ.50 కోట్లతో 38 మంది కౌన్సిలర్లకు వారి వారి వార్డుల్లో రూ.50 లక్షల నుంచి 75లక్షల చొప్పున కేటాయించాలన్నారు. గంజ్‌ మైదాన్‌లో నిర్మించిన దుకాణ సముదాయాలను చిరువ్యాపారులకు కేటాయించే విషయంపై ఈనెల 15న అదనపు కలెక్టర్‌ రాజర్షిషాను కలుస్తానని  జగ్గారెడ్డి తెలిపారు.  గంజ్‌మైదాన్‌లో సీసీ ఫ్లోరింగ్‌, రోడ్లు, తాగునీటి సదుపాయం, చేపలు అమ్ముకొనే వారి కోసం ఫ్లాట్‌ఫారాలకు నిధులు కేటాయించాలని సూచించారు. పట్టణంలోని హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు శ్మశాన వాటిక కోసం నిధులు కేటాయించాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉండి సంగారెడ్డి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. ప్రధానంగా సంగారెడ్డిలో ఐఐటీ, అగ్రికల్చర్‌యూవర్సిటీ, రాజీవ్‌పార్కు, స్విమ్మింగ్‌పూల్‌, శిల్పారామం, కల్వకుంట రోడ్డు, రాజంపేట రోడ్డు తదితర అనేక పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చానని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, టీపీవో కరుణాకర్‌, కౌన్సిలర్లు వెంకట్‌ రాజు, షఫీ, నాగరాజు, యువజన కాంగ్రెస్‌ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన సంతోష్‌, మాజీ కౌన్సిలర్‌ కసిని రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T05:10:38+05:30 IST