ఆమెకు రక్షణేది?
ABN , First Publish Date - 2022-06-16T05:30:00+05:30 IST
మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం రక్షణ లేకుండాపోతుంది.
మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు
చట్టాలపై భయం ఉంటేనే వేధింపులకు కళ్లెం
అశ్లీలసైట్లు, వీడియోలతో చెడు మార్గంలో యువత!
లాక్‌డౌన్ కాలంలో హత్యలు, అత్యాచారాలు తగ్గినా
కొన్నిరోజుల నుంచి మళ్లీ పెరుగుతున్న వైనం!!
సంగారెడ్డి క్రైం, జూన్ 16 : మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం రక్షణ లేకుండాపోతుంది. యేడాదికేడాది హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం మహిళలు, బాలికలకు వేధింపులు తప్పడం లేదు. పురుషాధిక్య సమాజంలో ఆమె ఒక సమిధగా మారుతున్నది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇటీవల మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో కూడా ఇటీవల కాలంలో బాలికలపై అత్యాచార, అత్యాచారయత్న ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు సంవత్సరాల క్రితం లాక్‌డౌన్ కారణంగా కొంత వరకు మహిళల హత్యలు, అత్యాచారాలు తగ్గినప్పటికీ ఈ సంవత్సరం జనవరి నుంచి ఇటువంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 2018 నుంచి 2021 డిసెంబర్ వరకు జరిగిన నేరాలను సమీక్షిస్తే 2018లో మహిళల హత్యలు 4, అత్యాచారాలు 42, కిడ్నా్‌పలు 19, మహిళలను అవమానపర్చిన కేసులు (సెక్షన్ 354 ఐపిసి) 103, భర్తల వేధింపులు 129. ఇక 2019 సంవత్సరంలో మహిళల హత్యలు 17, అత్యాచారాలు 52, కిడ్నా్‌పలు 18, మహిళలను అవమానపర్చిన కేసులు 91, భర్తల వేధింపు కేసులు 162 నమోదయ్యాయి. అలాగే 2020 సంవత్సరంలో మహిళల హత్యలు 12, అత్యాచారాలు 35, కిడ్నా్‌పలు 15, మహిళలను అవమానపర్చిన కేసులు 81, భర్తల వేధింపులు 107 కేసులు నమోదైనట్లు పోలీసుల గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2021లో మహిళల హత్యలు 10, అత్యాచారాలు 37, కిడ్నా్‌పలు 14, మహిళలను అవమానపర్చిన కేసులు 83, భర్తల వేధింపులు 109 కేసులు చోటుచేసుకున్నాయి. 2022 సంవత్సరం జనవరి నుంచి మే 31 వరకు మహిళలపై జరిగిన నేరాలను సమీక్షిస్తే మహిళల హత్యలు 6, కిడ్నా్‌పలు 8, అత్యాచారాలు 20, మహిళలపై వేధింపులు 31 చోటు చేసుకున్నాయి. తాజాగా నారాయణఖేడ్ మండలంలోని 14ఏళ్ల బాలికపై మండలంలోని నమ్లిమేట్ గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 6న నారాయణఖేడ్ మండలంలోని ఓ బాలికను అదే మండలం నమ్లిమేట్ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. నాలుగు రోజులు పాటు ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడు. అదృశ్యమైన బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నారాయణఖేడ్ పోలీసులు బాలిక వద్ద ఉన్న ఫోన్ ద్వారా లొకేషన్ కనుగొని బాలికతో పాటు యువకుడిని కూడా ఈనెల 10న అదుపుతోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించి, నిందితునిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
స్మార్ట్‌ఫోన్లతో జరభద్రం
చట్టాలు సక్రమంగా అమలై నిందితులకు శిక్ష పడితేనే మహిళలపై లైంగిక వేధింపులు, బాలికలపై అత్యాచార ఘటనలు అరికట్టేందుకు అవకాశం ఉంటుందని పలు మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మహిళల రక్షణ కోసం నిర్భయ, బాలికల రక్షణ కోసం పోక్సో వంటి చట్టాలు ఉన్నా కూడా నిందితుల్లో భయం లేని కారణంగానే మహిళలపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. రెండు సంవత్సరాల కాలంలో కరోనా విజృంభించడంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌తరగతులు అనివార్యమైంది. దీంతో టెన్త్, ఇంటర్ చదివే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వక తప్పలేదు. తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు స్మార్ట్‌ఫోన్లలో అశ్లీల వెబ్‌సైట్లు, వీడియోలు చూడడం వల్ల కొందరు చెడుమార్గాన్ని అనుసరించి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లో తరగతులు వింటున్న విద్యార్థులపై తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
చట్టాలపై అవగాహన అవసరం
- భూపాల్‌రెడ్డి, న్యాయవాది, సంగారెడ్డి
మహిళల, బాలికల రక్షణ కోసం ఏర్పాటైన చట్టాలపై విస్తృత ప్రచారం అవసరం. ముఖ్యంగా మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చట్టాలు ఉంటాయని ప్రతి ఒక్కరికీ అవగాహనతో పాటు భయం ఉండాలి. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే సెక్షన్ 354 ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. చిన్న పిల్లలను లైంగికంగా వేధిస్తే (పోక్సో) ప్రివెన్షన్ యాక్ట్ ఫర్ చిల్ర్డెన్‌సెక్స్యువల్ అఫెన్సెస్ కింద కేసులు నమోదు చేస్తారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటేనే మహిళలపై దాడులు అరికట్టేందుకు అవకాశం ఉంది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలు తెస్తున్నప్పటికీ మహిళలు, బాలికలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించడం అలవర్చుకోవాలి.