రూ.100 కోట్లు ఉత్తమాటేనా?
ABN , First Publish Date - 2022-12-15T00:20:54+05:30 IST
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలోని ఏడుపాయల వనదుర్గాభవాని పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్తమాటలకే పరిమితమైంది.
ఏడుపాయలలో పర్యాటక అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం
బడ్జెట్లో నిధులను కేటాయించిన మంత్రి హరీశ్‌రావు
తొమ్మిది నెలలు గడిచినా అందని నిధులు
ఏడాది పొడవునా అధిక సంఖ్యలో భక్తుల రాక
అభివృద్ధికి ఆమడదూరంలో వనదుర్గా ఆలయం!
ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్, డిసెంబరు 14: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలోని ఏడుపాయల వనదుర్గాభవాని పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్తమాటలకే పరిమితమైంది. మల్లన్న సాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి రిజర్వాయర్లతో పాటు ఏడుపాయల ఆలయాన్ని కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీటన్నింటి కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు గత మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఏడుపాయలకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు నయాపైసా రాలేదు. ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయానికి ఏడాది పొడవునా భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తారు. భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా, బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించినా నేటికీ నిధులు విడుదల కాలేదు. నేతల మాటలు నీటిమూటగానే మిగిలిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నేటికీ మెరుగుపడని సౌకర్యాలు
ఏడుపాయల అభివృద్ధికి ప్రభుత్వం ప్రకటించిన రూ.100 కోట్లతో అనేక కార్యక్రమాలను చేపట్టవచ్చని భావించారు. వనదుర్గా ఆలయానికి మాఘ అమావాస్య, శివరాత్రి జాతరకే కాకుండా ప్రతిరోజు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సెలవు రోజులు, వారాంతరాల్లో వేలసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వారికి అవసరమైన వసతి సౌకర్యాలు ఇక్కడ లేవు. కేవలం దాతలు కట్టించిన షెడ్లు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఉన్న వసతి సౌకర్యాలు అంతంత మాత్రమే. భారీసంఖ్యలో వచ్చే భక్తులంతా చెట్ల కిందనే సేదతీరుతారు. దూరప్రాంతాల నుంచి ఏడుపాయలకు వచ్చే భక్తులు ఖర్చుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. వారి అవసరమైన సౌకర్యాల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కానీ సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.100కోట్లను విడుదల చేస్తే ఏడుపాయలలో ఆఽధునిక హంగులతో వసతి సౌకర్యాలతో పాటు అందమైన కాటేజీలు, బాంకిట్ హాల్స్, కన్వెన్షన్ హాల్ వంటివి నిర్మించేందుకు అవకాశం ఉండేది.
విడుదల కాని నిధులు
ఏడుపాయల అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తున్నట్లు శాసనసభలో ప్రభుత్వం ప్రకటించి డిసెంబరు 7 నాటికి సరిగ్గా 9 నెలలు, కానీ నయాపైసా విడుదల కాలేదు. దీంతో వనదుర్గా ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ఆలోచన ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే ఏడుపాయల పుణ్యక్షేత్రం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. వాటర్ ఫౌంటేయిన్లు, కాటేజీలు, రహదారుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. ఏడుపాయలకు వచ్చే వారికి అన్ని రకాల వసతి, సౌకర్యాలు సమకూరుతాయి. కొండల మధ్యన వెలసిన అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం లేదు. దీంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని భక్తులు ఎన్నో ఏళ్లుగా ఆలయ అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిధులు వస్తే ఆలయ గిరి ప్రదక్షిణకు కూడా సౌకర్యం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏడుపాయల అభివృద్ధికి ప్రకటించిన వంద కోట్ల నిధులను విడుదల చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిధుల విడుదలకు సంబంధించి జీవో రాలేదు
- శ్రీనివాస్, ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయ ఈవో
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగానే ఏడుపాయలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు నిధుల విడుదలకు సంబంధించిన జీవో మాత్రం రాలేదు.