అంతర్‌ విభాగ పరిశోధనలు అవసరం

ABN , First Publish Date - 2022-09-12T04:24:30+05:30 IST

సాంకేతికత పురోగమిస్తున్న కొద్దీ అంతర్‌ విభాగ పరిశోధనలతో జ్ఞానానికి ప్రాముఖ్యం పెరిగిందని వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం డీన్‌ ప్రొఫెసర్‌ మల్లారెడ్డి అన్నారు.

అంతర్‌ విభాగ పరిశోధనలు అవసరం
మల్లారెడ్డిని అభినందిస్తున్న గీతం ఫ్రొపెసర్లు

గీతం అంతర్జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో కేయూ డీన్‌ ప్రొఫెసర్‌ మల్లారెడ్డి 

పటాన్‌ చె రు రూరల్‌, సెప్టెంబరు 11: సాంకేతికత పురోగమిస్తున్న కొద్దీ అంతర్‌ విభాగ పరిశోధనలతో జ్ఞానానికి ప్రాముఖ్యం పెరిగిందని వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం డీన్‌ ప్రొఫెసర్‌ మల్లారెడ్డి అన్నారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ గణితశాస్త్ర సంఘం(ఏపీటీఎ్‌సఎంఎస్‌) సహకారంతో గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ గణితశాస్త్ర విభాగం నిర్వహిస్తున్న ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ... విజయవంతంగా సదస్సును నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఏపీటీఎ్‌సఎంఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎన్‌.కిషన్‌ మాట్లాడుతూ, సదస్యుల జ్ఞానాన్ని పెంపొందించి, వినూత్న ఆలోచనలను రేకెత్తించేలా ప్రముఖుల ఆతిథ్య ఉపన్యాసాలు కొనసాగాయన్నారు. ఈ సదస్సు పరిశోధక విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని ఏపీటీఎ్‌సఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పి.జయసుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. అధునాతన పరిశోధనలు, కొత్త విషయాలను తెలుసుకోవడానికి, కొంగొ త్త స్నేహాలు ఏర్పడడానికి ఈ సదస్సు తోడ్పడినట్టు గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ దత్తాత్రి కె.నగేశ వ్యాఖ్యానించారు. ఈ అంతర్జాతీయ సదస్సు నివేదికను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బీఎం నాయుడు సమర్పించగా, కార్యదర్శి డాక్టర్‌ పి.నారాయణస్వామి వందన సమర్పణ చేశారు. మరో నిర్వాహకుడు డాక్టర్‌ శివారెడ్డి శేరి, గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ ఎం.రెజా, డాక్టర్‌ డి.మల్లికార్జునరెడ్డి తదితరులు సదస్సు నిర్వహణలో తోడ్పడ్డారు. ఇతర పరిశోధకులు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి, సందేహ నివృత్తికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సదస్సు దోహదపడినట్టు తమ ప్రతిస్పందన (ఫీడ్‌ బ్యాక్‌)లో మిజోరాం ఎస్‌ఐటీ నుంచి వచ్చిన రాధ అభిప్రాయపడ్డారు. సదస్సును ప్రణాళికాబద్ధంగా, ఉపయుక్తంగా నిర్వహించి కొంగొత్త అంశాలు నేర్చుకోవడానికి వీలు కలిగినట్టు పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఎం.శ్రీకుమార్‌ చెప్పారు. సదస్సులో పాల్గొన్న ప్రతీ ఒక్కరితో పాటు పత్ర సమర్పణకు అధ్యక్షత వహించిన వారికి కూడా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఏపీటీఎ్‌సఎంఎస్‌ కార్యనిర్వాహక సభ్యులతో పాటు ఇతర అతిథులను కూడా సత్కరించారు.

Read more