కుకునూరుపల్లి మండలానికి శ్రీకారం

ABN , First Publish Date - 2022-11-27T23:51:58+05:30 IST

నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు 15 గ్రామాలతో కొత్త మండలం ఎట్టకేలకు నెరవేరిన ఈ ప్రాంత ప్రజల కల

కుకునూరుపల్లి మండలానికి శ్రీకారం
కుకునూర్‌పల్లిలో ఏర్పాటు చేసిన తహసీల్దార్‌ కార్యాలయ భవనం

కొండపాక, నవంబరు 27: జిల్లాలో కొత్త మండలంగా ఏర్పడిన కుకునూరుపల్లిని సోమవారం రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. మండలంగా ఏర్పడడంతో ఈ ప్రాంత గ్రామాల ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. సోమవారం నుంచి మండల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మండల కార్యాలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. దశాబ్దాల నుంచి కుకునూరుపల్లి కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతూ వచ్చారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జూలై 27న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎట్టకేలకు సెప్టెంబరు 27న కునూరుపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది.

15 గ్రామాలతో మండల స్వరూపం

కొండపాక మండలం నుంచి పది గ్రామాలు, జగదేవపూర్‌ మండలం నుంచి ఐదు గ్రామాలతో కుకునూరుపల్లి మండలాన్ని 15 గ్రామాలతో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొండపాక మండలంలోని కుకునూరుపల్లి, లకుడారం, మాత్‌పల్లి, మంగోల్‌, ఎర్రవల్లి, తిప్పారం, మేదినిపూర్‌, సింగారం, ముద్దాపూర్‌, కోనాయిపల్లి గ్రామాలతో పాటు జగదేవ్‌పూర్‌ మండలంలోని చిన్న కిష్టాపూర్‌, రామచంద్రాపురం, రాయవరం, వెంకటాపూర్‌, ఎల్లాయగూడెంలతో కలిపి కొత్త మండలంగా ఏర్పాటు చేశారు.

మోడల్‌గా తహసీల్దార్‌ కార్యాలయం

కుకునూరుపల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం పక్కనే కొత్తగా నిర్మించిన భవనంలో ఏర్పాటు చేశారు. దాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దారు.

Updated Date - 2022-11-27T23:51:59+05:30 IST