యథేచ్ఛగా రసాయనాల పారబోత
ABN , First Publish Date - 2022-10-17T05:44:37+05:30 IST
రసాయన పరిశ్రమల వ్యర్థాలు యథేచ్ఛగా రహదారులు, నీటి వనరుల్లోకి వదిలివేస్తున్నారు.
నిధులున్నా ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు ఎప్పుడో?
మూసీ నదిలోకి వ్యర్థాల తరలింపు
తాజాగా బొల్లారంలో పట్టుబడ్డ కెమికల్ ట్యాంకర్
జిన్నారం, అక్టోబరు 16: రసాయన పరిశ్రమల వ్యర్థాలు యథేచ్ఛగా రహదారులు, నీటి వనరుల్లోకి వదిలివేస్తున్నారు. జిన్నారం మండల పారిశ్రామిక వాడల్లో లెక్కకు మించి జరిగే ఉత్పాదనల వల్ల వచ్చే వ్యర్థ రసాయనాలు శుద్ధి కేంద్రాల్లోకి తీసుకునే అవకాశం లేక కొన్ని పరిశ్రమలు అక్రమార్కుల అండతో స్థానిక రహదారులు, నీటి వనరులతో పాటు దూరాన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతాలకు ట్యాంకర్లలో తరలించి పారబోస్తున్నారు.
స్థానికంగా శుద్ధి కేంద్రాలు లేక
ఉమ్మడి జిన్నారం మండలంలోని 7 గ్రామ పంచాయతీల పరిధిలో వందలాది పరిశ్రమలుండగా వాటిలో 90 శాతం రసాయ పరిశ్రమలే. కొన్ని పరిశ్రమలు అనుమతి లేని ఉత్పాదనలు చేపడితే.. మరి కొన్ని అధిక ఉత్పాదనలు జరిపి వాటి వల్ల వచ్చే రసాయక వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు (ఈటీపీ, సీటీఈపీ)లకు తరలించే అవకాశం లేక యథేచ్ఛగా పారబోతలకు పాల్పడుతున్నారు. పారిశ్రామిక వాడలు దాటగానే ట్యాంకర్లలో రహదారుల పక్కన డంప్ చేస్తున్నారు. ఇటీవల గడ్డపోతారంలో సర్వే 27లో రహదారులపై భారీగా వ్యర్థాలు పారవేశారు. అయ్యమ్మ చెరువుపై భాగంలో రసాయన జలాలు ఏరులై పారుతున్నాయి. స్థానికులు రెండు పరిశ్రమలపై పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
భారీ ఖర్చులను భరించలేక
వ్యర్థ రసాయన జలాలు శుద్ధి కేంద్రాలకు తరలిస్తే భారీగా ఖర్చు కావడం కూడా పారబోతలకు కారణం. ఒక్కో ట్యాంకరు రసాయన జలాలు శుదిఽ్ధ చేయాలంటే రూ.75 వేల నుంచి లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది. దీంతో కాలుష్య జలాలను కొన్ని పరిశ్రమలు ఎక్కడిక్కడ పారవేస్తున్నారు. ఇటీవల గడ్డపోతారం పారిశ్రామిక వాడలకు చెందిన ఓ పరిశ్రమ నుంచి తరలించిన వ్యర్థాల ట్యాంకర్ను సూర్యపేట జిల్లాలో మూసినది వద్ద పారవేతకు సిద్దం కాగా పీసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. మరో పరిశ్రమకు చెందిన ట్యాంకరును సూర్యపేట జిల్లా కేంద్రం సమీపంలో పట్టుకున్నారు. తాజాగా బొల్లారంలో ఈ నెల 15న రాత్రి వేళ హైగ్రో పరిశ్రమ నుంచి వచ్చిన ట్యాంకరును స్థానికులు పట్టుకుని పీసీబీ అధికారులకు అప్పగించారు. దీంతో ఎన్నో రోజులుగా పారవేతలే లక్ష్యంగా మండలం నుంచి రసాయనాల ట్యాంకర్లు తరళివెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు.
శుద్ధి కేంద్రాల ఏర్పాటు ఎప్పుడో?
మండలంలో వందల సంఖ్యలో రసాయన పరిశ్రమలున్నా వ్యర్థాల శుద్ధి కేంద్రం ఒక్కటి కూడా లేక పోవడం సమస్యకు ప్రధాన కారణం. నిత్యం ఇక్కడి నుంచి అనుమతి ఉన్న పరిశ్రమల వ్యర్థాలను జేఈటీఎల్ జీడిమెట్ల, పీఈటీఎల్ పటాన్చెరు, ఘన వ్యర్థాలు రాంకీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. మండలానికి దూరంగా శుద్ధి కేంద్రాలు ఉండటంతో పరిశ్రమల నుంచి వెళ్లే కాలుష్య జలాల ట్యాంకర్లు ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయో గుర్తించే వ్యవస్థ సక్రమంగా లేక దూరప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల మధ్య రసాయన వ్యర్థాలను తరలించాలి. కాని పారిశ్రామిక ప్రాంతాల్లో చాలావరకు వ్యర్థాల వాహనాలు రాత్రివేళ కనిపించడం గమనార్హం. ఇక్కడ వందల సంఖ్యలో ఉన్న నీటి సరఫరా ట్యాంకర్లు కూడా గుట్టుగా రసాయనాల పారవేతలకు ఉపయోగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. కాగా నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు సమయంలో వసూలు చేసిన 2 శాతం నిధుల నుంచి సుమారు రూ.12 కోట్లతో మండలంలో రెండు ఎఫ్లయొంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నా ఆచరణ ఎప్పుడో అధికారులకు తెలియని పరిస్థితి నెలకొన్నది.