ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే భారత్‌ జోడోయాత్ర

ABN , First Publish Date - 2022-09-09T05:16:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను చేపట్టారని హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే భారత్‌ జోడోయాత్ర
భారత్‌ జోడో పాదయాత్రలో పాల్గొన్న ప్రవీణ్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి

హుస్నాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 8: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను చేపట్టారని హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. గురువారం రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు సంఘీభావంగా మండలంలోని పందిల్ల నుంచి పోతారం(ఎస్‌) వరకు ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అప్రాజాస్వామిక విధానాలపై గళమెత్తుతూ కాంగ్రెస్‌ తరఫున ప్రజలను మమేకం చేసేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. దేశంలో మతతత్వ శక్తులను బీజేపీ ప్రేరేపిస్తూ మత కలహాలు సృష్టిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రె్‌సను రానున్న రోజుల్లో అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. తెలంగాణకు మొదటి సీఎంను దళితుడిని చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ హామీ నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ చిత్తారి పద్మ, సీనియర్‌ నాయకులు చిత్తారి రవీందర్‌, కాంగ్రెస్‌ మండలాల అధ్యక్షులు బంక చందు, జంగపల్లి అయిలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

మోదీ చేసిందేమి లేదు: కవ్వంపల్లి సత్యనారాయణ

బెజ్జంకి, సెప్టెంబరు 8: కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుచి సామాన్య ప్రజలపై భారం మోపడం తప్ప ప్రధాని మోదీ చేసిందేమీ లేదని కాంగ్రెస్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు సంఘీభావంగా గురువారం బెజ్జంకి మండలంలో కాంగ్రెస్‌ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కవ్వంపల్లి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Read more