ఆగని అక్రమ నిర్మాణాలు

ABN , First Publish Date - 2022-12-31T23:00:12+05:30 IST

అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ చట్టంలో పలు మార్పులు చేపట్టింది. చట్ట సవరణలు చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదు.

ఆగని అక్రమ నిర్మాణాలు

తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

నిర్మాణదారులకు నాయకుల అండ

మున్సిపల్‌ ఆదాయానికి గండి

పత్తాలేని ఎన్‌ఫోర్స్‌మెంట్‌

రామచంద్రాపురం, డిసెంబరు 31: అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ చట్టంలో పలు మార్పులు చేపట్టింది. చట్ట సవరణలు చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదు. నిర్మాణదారులు స్థానిక నాయకుల సహకారంతో యథేచ్ఛగా నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాల కారణంగా ఇరుగుపొరుగు వారు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.

హెచ్‌ఎండీఏ పరిధిలోకి మున్సిపాలిటీ భూములు

తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో గజం స్థలం రూ. లక్ష నుంచి 1.5 లక్షలు పలుకుతుంది. ఇంటి నిర్మాణ అనుమతులకు లక్షల్లో చెల్లించాల్సిందే. 200 గజాల స్థలంలో మూడు అంతస్తుల నిర్మాణం చేపడితే నిర్మాణ అనుమతులకు సుమారు రూ. 6 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అద్దెలు కూడా రూ. 10వేల నుంచి రూ. లక్ష వరకు ఉన్నాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. కొద్దిపాటి స్థలంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు.

అనుమతుల జారీ ఇలా..

బహుళ అంతస్తులు కమర్షియల్‌ నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేస్తుంది. కమర్షియల్‌ అనుమతులు, 12 వందల గజాలకు పైబడిన రెసిడెన్షియల్‌ భవనాల అనుమతులు హెచ్‌ఎండీఏ జారీ చేస్తుంది. 50 గజాల నుంచి 12 వందల గజాల వరకు రెసిడెన్షియల్‌ ఇళ్ల నిర్మాణాలకు మున్సిపాలిటీ అనుమతులు జారీ చేస్తుంది. స్థలాన్ని బట్టి అంతస్తులు జారీ చేస్తుంది. మున్సిపల్‌ పరిధిలో హెచ్‌ఎండీఏ జారీ చేసిన అనుమతులకు సంబంధించిన రుసుంలో కొంత మొత్తాన్ని నెలల తరువాత మున్సిపాలిటీకి బదిలీ చేస్తుంది. గతంలో ప్రభుత్వం అదనపు అంతస్తులను క్రమబద్దీకరించిన సమయంలో మున్సిపాలిటీకీ ఆదాయం సమకూరేది. అదనపు అంతస్తులకు మున్సిపాలిటీ పెనాల్టీ వసూలు చేసేది. ప్రస్తుతం పెనాల్టీ, బీఆర్‌ఎ్‌సలను కొత్త మున్సిపల్‌ చట్టంలో తొలగించడంతో ఆమేరకు ఆదాయం కోల్పోతున్నది

భెల్‌ కాలనీలో అక్రమ నిర్మాణాలు అధికం

తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని భెల్‌ ఎంఐజీ ఫేజ్‌ 2 విద్యుత్‌నగర్‌ కాలనీలో అక్రమ నిర్మాణాలు అధికంగా వెలుస్తున్నాయి. ఈ కాలనీలో ఎక్కువగా 200 గజాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం మూడు అంతస్తుల వరకు నిర్మాణ అనుమతులను అధికారులు జారీ చేస్తారు. కొందరు రెండు, మూడు అంతస్తులకు నిర్మాణ అనుమతులు తీసుకుని ఐదారు అంతస్తులను నిర్మిస్తున్నారు. సెట్‌బ్యాక్‌ నిబంధనను అటకెక్కించి రోడ్డు వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఎంఐజీలోని కొందరు అక్రమ నిర్మాణదారులకు ఓ ప్రజాప్రతినిధి భర్త అండదండలు ఉన్నట్టు విమర్శలున్నాయి. అక్రమ నిర్మాణదారులకు ప్రశ్నించడానికి వెళ్లిన అధికారులతో సదరు నాయకుడు దురుసుగా వ్యవరించడం కాలనీలో చర్చాంశనీయంగా మారింది. అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో ఇప్పటి వరకు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూల్చలేదు. మున్సిపల్‌ సిబ్బంది ఒకటి రెండు నిర్మాణాలు కూల్చారు.

నోటీసులు జారీ చేస్తాం : శ్రీనివాస్‌, తెల్లాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌

భేల్‌ పరిధిలోని ఎంఐజీ కాలనీలో అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తాం. విచారణ చేపట్టి నిబంధనలు పాటించనట్టు తేలితే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-12-31T23:00:13+05:30 IST