జోరు వాన

ABN , First Publish Date - 2022-05-19T05:28:21+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట, పుల్కల్‌, కోహీర్‌, కంది తదితర మండలాల్లో దాదాపు గంట సేపు జోరువాన కురిసింది.

జోరు వాన
చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతులు

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వర్షం

పలుచోట్ల విరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం

వర్షానికి తడిసిన ధాన్యం.. రైతన్నలకు తప్పని తిప్పలు

అకాల వర్షాలతో అల్లాడుతున్న అన్నదాతలు

కొనుగోళ్లలో వేగం పెంచిన అధికార యంత్రాంగం!


సంగారెడ్డిటౌన్‌/హత్నూర మే18: సంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట, పుల్కల్‌, కోహీర్‌, కంది తదితర మండలాల్లో దాదాపు గంట సేపు జోరువాన కురిసింది. సంగారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి శాంతినగర్‌లోని సెయింట్‌ ఆంథోనిస్‌ పాఠశాల వద్ద మామిడిచెట్టు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ స్తంభం నేలకొరిగి కరెంటు తీగలు తెగిపోవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ అధికారులు సకాలంలో స్పందించి వర్షం తగ్గగానే మరమ్మతులు చేశారు. హత్నూర మండలంలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిముద్దయింది. ధాన్యం కుప్పలు తడవకుండా రైతులు ఎంతో శ్రమించినా ఫలితం లేకుండాపోయింది. కేంద్రాల వద్ద రైతులకు సక్రమంగా సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. 


మెదక్‌ జిల్లాలో పలుచోట్ల..

వెల్దుర్తి /తూప్రాన్‌రూరల్‌, మే 18: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. రైతుల కష్టం నీటిపాలవుతున్నది. బుధవారం మాసాయిపేట తహసీల్దార్‌ మాలతి, సర్పంచ్‌ మధుసూధన్‌రెడ్డి, మండల సహకార సంఘం డైరెక్టర్‌ నర్సింహులు ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న క్రమంలో జోరువాన కురిసింది. రైతుల నుంచి టార్పాలిన్లు తీసుకుని తడవకుండా కప్పుకున్నారు. అకాల వర్షాలు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తూప్రాన్‌ మండలంలో కురిసిన తేలికపాటి వర్షానికి పలుచోట్ల రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. నాగులపల్లి, వట్టూరు, జెండాపల్లి, ఇస్లాంపూర్‌, దాతర్‌పల్లి తదితర ప్రాంతాల్లో స్వల్పంగా వాన పడింది. ఐదారురోజుల నుంచి ధాన్యం ఆరబోయడం, సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షం పడుతుండడంతో ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కొన్నిచోట్ల ధాన్యం గింజలు మొలకలొస్తున్నాయి. మరోవైపు లారీల కొరత వల్ల కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. కొందరు మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి విముఖత చూపిస్తుండడంతో  సెం టర్ల నిర్వాహకులకు, రైతులకు తలనొప్పిగా మారింది.


 తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి

 కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రైతుల ధర్నా, రాస్తారోకో 

సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

చిన్నశంకరంపేట, మే 18: ఖరీ్‌ఫలో వరికోతలు మొదలై నెలరోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. అకాల వర్షాలకు ధాన్యం తడిసిముద్దవుతున్నది. బుధవారం డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోతరాజు రమణ ఆధ్వర్యంలో గవ్వలపల్లి, సంగాయిపల్లి, కొర్వీపల్లి, అంబాజీపేట పలుగ్రామాలకు చెం దిన రైతులు గవ్వలపల్లి ఎక్స్‌రోడ్డు మెదక్‌-చేగుంట రహదారిపై గంటపాటు రాస్తారోకో చేసి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రమణ మాట్లాడుతూ ఖరీ్‌ఫలో అతివృష్టి, అనావృష్టితో నష్టపోతున్న రైతులగోడును పట్టించుకోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని హెచ్చరించారు. కొన్ని రోజుల నుంచి రైతులు ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలతో తడిసిముద్దయింది. ఎండలకు ఎండి, వానలకు తడిసి మొలకలు వస్తున్నాయని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా నాయకులు రైతులను పలకరించిన దాఖలాలు లేవన్నారు. అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఫొటోలకు మాత్రం ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాకు 40 కిలోల కంటే అదనంగా రెండు మూ డు కిలోలు తూకం వేస్తున్నా అధికారులకు మాత్రం పట్టింపులేదని ఆరోపించారు. రైతురాజ్యమన్న సీఎం కేసీఆర్‌ రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు.  గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పారబోశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార యంత్రాంగం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కాంగ్రెస్‌ పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని  ప్రభుత్వానికి హెచ్చరించారు. రాస్తారోకోను విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ కాసేపు ఉద్రిక్తత నెలకొన్నది. రాస్తారోకోలో నార్సింగి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవర్దన్‌, ఎంపీటీసీ ప్రసాద్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీ అంజాగౌడ్‌, పట్టణ అధ్యక్షుడు వెంకట్‌గౌడ్‌, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. Read more