జీఎస్టీ, నోట్ల రద్దుతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ

ABN , First Publish Date - 2022-11-03T00:29:13+05:30 IST

ప్రధాని మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు.

జీఎస్టీ, నోట్ల రద్దుతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ
ముత్తంగిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, అనువాదం చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వేదికపై మధుయాష్కి, రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి, తదితరులు

ముత్తంగి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి/పటాన్‌చెరురూరల్‌ నవంబరు 2: ప్రధాని మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ముత్తంగిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడారు. తప్పుడు విధానాలతో రూపొందించిన జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు కొవిడ్‌ సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సాయం చేయకుండా కార్మికుల నడ్డివిరగొట్టారన్నారు. తప్పుడు జీఎస్టీ వల్ల చిన్నా, మధ్యతరహా పరిశ్రమలకు ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. నోట్ల రద్దు వల్ల బల్లారిలో నాలుగు లక్షల మంది కార్మికులతో ఉన్న జీన్స్‌ తయారీ కంపెనీ ఇప్పుడు 40 వేల మందికి పడిపోయిందని చెప్పారు. ఇంజనీరింగ్‌ చదివినా ఉద్యోగాలు దొరకడం లేదన్నారు. నిరుద్యోగ సమస్యపై గొంతు లేవదీసేందుకే తాను ఈ యాత్ర కొనసాగిస్తున్నానన్నారు. కొన్నేళ్ల క్రితం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 ఉంటే మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. అదే మోదీ ప్రధాని అయ్యాక ఇప్పుడు సిలిండర్‌ ధర రూ.1100 అయినా మాట్లాడటం లేదన్నారు. పెట్రోలు, డీజిల్‌ రూ.100 దాటినా నోరు తెరవకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ కూడా నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. సభలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అభిమానుల్ని ఉత్తేజపరిచిన ప్రసంగం

రాహుల్‌ ప్రసంగం ఆద్యంతం అభిమానుల్ని ఉత్తేజపరిచింది. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఛలోక్తులతో రాహుల్‌ ప్రసంగం కొనసాగింది. రాహుల్‌గాంధీ హిందీ ప్రసంగానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుగులో అనువాదం చేశారు.

రాహుల్‌గాంధీ కేసీఆర్‌నుద్దేశించి మాట్లాడుతూ.. ఇక్కడ దూస్రా మోదీ ఉన్నాడని చెప్పడంతో సభాప్రాంగణం అభిమానుల చప్పట్లతో మార్మోగింది.

రాహుల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగిస్తుండగా తెలుగు అనువాదం చేసే అవకాశం ఇవ్వకుండా ఎక్కువసేపు మాట్లాడటంతో ఉత్తమ్‌ అనువాదం చేయలేక అటు ఇటు చూసిన బేల చూపులు సభాప్రాంగణంలో నవ్వులు పూయించింది.

అనంతరం రాహుల్‌గాంధీ ఉత్తమ్‌ వంక చూస్తూ భుజం తట్టి అనువాదానికి వీలు చిక్కేలా ప్రసంగాన్ని కొనసాగించడంతో ఉత్తమ్‌ తెలుగులో అనువాదం చెప్పారు.

స్థానిక నాయకుడు రాధాకృష్ణ హరి పంతులు ఆధ్వర్యంలో ముత్తంగిలో భారీ ఏర్పాట్లు చేసిన సభా వేదిక వద్దకు స్థానిక నేతలు ఎవరినీ అనుమతించలేదు.

ముత్తంగి సభా వేదిక దిగగానే రాహుల్‌ వాహనంలో రుద్రారం వెళ్లిపోయారు. ముత్తంగి నుంచి ఇస్నాపూర్‌ వరకు రోడ్లపై బారులు తీరిన అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

ఇస్నాపూర్‌లో సర్పంచ్‌ బాలమణి శ్రీశైలం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేదిక ఏర్పాటు చేసినా రాహుల్‌ వెళ్లి పోవడంతో స్థానిక నాయకులంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

Updated Date - 2022-11-03T00:29:14+05:30 IST