రాష్ట్రంలో కేసీఆర్ గ్రాఫ్ డౌన్
ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రాఫ్ డౌన్ కావడంతో ప్రజల ఆలోచనా విధానాలను మార్చడానికి దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు కొత్త నాటకం ఆడుతున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉనికి కోసమే దేశరాజకీయాల ప్రస్తావన
ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ వైఫల్యం
అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతోనే పార్టీకి దూరంగా ఉన్నా
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
జగదేవ్‌పూర్, మే 20: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రాఫ్ డౌన్ కావడంతో ప్రజల ఆలోచనా విధానాలను మార్చడానికి దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు కొత్త నాటకం ఆడుతున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. జగదేవ్‌పూర్ సర్పంచ్ లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, రోడ్లు ఇలా ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. సీఎం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ అంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే కాదని, ఈ ప్రాంతాలకు మాత్రమే నిధులు కేటాయిస్తే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దివాలా తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కి దక్కిందన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలిపారు. తనకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉందని, అధిష్ఠానం తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల పార్టీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ప్రజలపక్షాన ఉద్యమం చేసినవారిని కాదని, కొత్తవారికి కీలక బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రజల పక్షాన పోరాడిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని సూచించారు. సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాలేకపోతున్నట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండాలా.. వద్దా? అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉందని తెలిపారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో కార్యకర్తల బలం ఉందని, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రాజేందర్‌రెడ్డి, గుబ్బ శ్రీనివాసరావు, బాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, పాషా, జంబుల వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.